Sumalatha Devi Takes Oath As President Of TFTDDA : ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ అసోసియేషన్ (TFTDDA) ప్రెసిడెంట్‌గా ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య శ్రీమతి వి.వి.సుమలతా దేవి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Continues below advertisement

'సమస్యలు పరిష్కరిస్తా'

తనకు ఓటు వేసిన, విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ TFTDDA ప్రెసిడెంట్ సుమలత ధన్యవాదాలు తెలిపారు. యూనియన్‌లో ప్రతీ ఒక్క సమస్యనూ పరిష్కరిస్తానని చెప్పారు. తమ మీద నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రతీ ఒక్కరికీ జానీ మాస్టర్ ధన్యవాదాలు తెలిపారు. 'ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన బాడీ సహకారంతో యూనియన్ సంక్షేమం కోసం పాటు పడతాం. యూనియన్‌లోని ప్రతీ ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ విషయాన్ని రామ్ చరణ్ గారికి చెప్పిన వెంటనే ఆయన ఆర్థిక సాయం అందించారు.

Continues below advertisement

యూనియన్‌లోని ప్రతీ ఒక్కరికీ స్థలం వచ్చేలా చూస్తామని చెప్పిన శ్రీశైలం యాదవ్ గారికి, నవీన్ యాదవ్ గారికి ధన్యవాదాలు. మన యూనియన్ నుంచి ఓ సభ్యుడు రిటైర్ వెళ్తే.. ఆ వెళ్లే సమయంలో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఇచ్చేలా ప్రణాళిక చేయాలని నా కోరిక. అది నెరవేరాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Also Read : 'ఛాంపియన్' ట్రైలర్ వచ్చేసింది - సరికొత్త స్పోర్ట్ డ్రామాలో రోషన్ యాక్షన్ అదుర్స్

'అండగా ఉంటాం'

ఈ యూనియన్‌కు ఫస్ట్ టైం ఓ మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికవ్వడం ఆనందంగా ఉందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తెలిపారు. 'సుమలత గారి విజయం యూనియన్‌కు కొత్త రూపుని తీసుకు వస్తుందని నమ్ముతున్నా. జానీ మాస్టర్ దేశ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. చిన్న స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగిన జానీ మాస్టర్, ఆయన సతీమణి సుమలత గారి మీద నమ్మకంతో వారిని ఎన్నుకున్నారు. మా ఫ్యామిలీని తమ ఫ్యామిలీగా చూసుకునే సినీ కార్మికులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. యూనియన్‌కు ఎప్పుడూ అండగా ఉంటా.' అని అన్నారు. అలాగే, యూనియన్‌లో చిన్న చిన్న సమస్యలు కలిసి పరిష్కరించుకుంటామని అన్నారు శ్రీశైలం యాదవ్.

సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా... శ్రీశైలం యాదవ్ ముందుండే వారని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. 'శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ చాలా గొప్ప వ్యక్తి. శ్రీశైలం గారి సతీమణి ఎంతో మంది మహిళా ఆర్టిస్టులు, డ్యాన్సర్లకు ఆర్థిక సహాయం అందించేవారు. జానీని ఎంతో మంది కిందకు లాగాలని ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగారు. సుమలత విజయం ఈ యూనియన్‌కు మంచి రోజుల్ని తీసుకు వస్తుంది. మా తరపున కూడా ఈ యూనియన్‌కు అన్ని రకాల సహాయ సహకారాల్ని అందిస్తాం.' అని అన్నారు.

టీం ఇదే

ప్రధాన కార్యదర్శిగా కె. శ్రీనివాసరావు, కోశాధికారిగా పి. చిరంజీవి కుమార్, ఉపాధ్యక్షులుగా కె. సురేష్, యమ్.రాజు, సహ కార్యదర్శులుగా కే.కిరణ్ కుమార్, ఏ. రాము, కార్య నిర్వహక కార్యదర్శిగా యు.శివకృష్ణ , కమిటీ సభ్యులుగా కె.సతీష్ గౌడ్, కె.శ్రీదేవి, పి.సురేష్, ఎస్.వేదాంత, మనోహర్, ఎల్.కృష్ణ, బి.సుమన్, ఆర్.బోస్, ఎస్.శృతి ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కమీషనర్ ఆఫ్ లేబర్ శ్యామ్ సుందర్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి  అమ్మిరాజు, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కోశాధికారి జి. భీముడు (శ్రీకాంత్) తదితరులు పాల్గొన్నారు.