Kangana Ranaut Slap Case: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ను కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాడికి పాల్పడిన సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ కుల్విందర్ కౌర్ ను అధికారులు సస్పెండ్ చేశారు. అనంతరం ఈ కేసులో పోలీసులు అమెను అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు.


ఇంతకీ ఏం జరిగిందంటే?


ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కంగనా ఢిల్లీకి వెళ్లే సమయంలో చండీగఢ్ విమానాశ్రయంలోఈ దాడి జరిగింది.  చండీగఢ్ ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ చెకింగ్ సమయంలో కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెతో కావాలనే వాగ్వాదానికి దిగింది. సెల్ ఫోన్ ట్రేలో పెట్టలేదనే కారణంతో ఆమెతో దురుసుగా ప్రవర్తించింది. ఆమె తీరుపై కంగనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. కోపంతో ఊగిపోయిన లేడీ కానిస్టేబుల్ కంగనాపై చేయి చేసుకుంది. గట్టిగా చెంపదెబ్బ కొట్టింది. కొద్ది సేపటి తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది.


అందుకే కంగనాను కొట్టా- కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్


కంగనాపై దాడి విషయం బయటకు తెలియగానే కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఈ ఘటనపై వివరణ ఇచ్చింది. కంగనాను కావాలనే కొట్టినట్లు చెప్పింది. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రైతులు చేసిన ఉద్యమం గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం వల్లే చెంపదెబ్బ కొట్టానని వివరించింది. ఒక్కో రైతు రూ.100  తీసుకుని అక్కడ కూర్చొని ఆందోళన చేస్తున్నారంటూ కంగనా గతంలో వ్యాఖ్యానించడం తనకు ఎంతో కోపాన్ని తెప్పించినట్లు వెల్లడించింది. ఆమె ఈ స్టేట్మెంట్ ఇచ్చిన సమయంలో తన అమ్మ కూడా రైతు ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పింది. మా అమ్మ లాంటి ఎంతో మంది రైతుల ఉద్యమాన్ని ఆమె కించపరచడం వల్లే ఈ దాడి చేసినట్లు వివరించింది. ఈ ఘటన తర్వాత ఉన్నతాధికారులు కుల్విందర్ సింగ్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.  


దాడిపై కంగనా స్పందన ఏంటంటే?


ఎయిర్ పోర్టులో తనపై దాడి జరగడం పట్ల కంగనా స్పందించింది. “ఈరోజు చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెక్ దగ్గర ఒక సంఘటన జరిగింది. నేను సెక్యూరిటీ చెక్ నుంచి బయటికి రాగానే ఒక సీఐఎస్ఎఫ్ స్టాఫ్ నా పక్కకు వచ్చి నన్ను తిడుతూ నాపై చేయి చేసుకుంది. తను ఎందుకలా చేసిందని అడగగా.. తాను రైతుల నిరసనను సపోర్ట్ చేస్తున్నానని చెప్పింది. నేను జాగ్రత్తగానే ఉన్నాను. కానీ పంజాబ్‌లో పెరుగుతున్న తీవ్రవాదం నన్ను కలవరపెడుతోంది’’ అంటూ వీడియో రిలీజ్ చేసింది.  


రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు


2020లో మోదీ సర్కారు రైతుల మేలు కలిగిస్తాయనే ఉద్దేశంతో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం తెచ్చిన చట్టాలతో లాభాల కంటే నష్టాలే ఎక్కవగా ఉన్నాయంటూ విమర్శించారు. సదరు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద సంఖ్యలో రైతులు ఉద్యమం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే, రైతు ఉద్యమంపై కంగనా అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉద్యమం చేస్తుంది రైతులు కాదు, ఉగ్రవాదులు అంటూ మండిపడింది. దేశాన్ని ముక్కలు చేసి చైనా కాలనీలుగా మార్చాలనుకుంటున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 


Read Also: పవన్ చెప్పులు మోసిన భార్య.. వీడియో వైరల్, అన్నా లెజినోవాకు సలాం చేస్తున్న నెటిజన్స్