Rishab Shetty: మానవ ముఖంలో 'హనుమాన్' - కన్నడ స్టార్ రిషబ్ శెట్టి, దర్శక నిర్మాతలపై ఫిర్యాదు, వివాదంలో 'జై హనుమాన్' పోస్టర్
Jai Hanuman: హనుమాన్ సీక్వెల్ 'జై హనుమాన్'లో హనుమంతుడి పోస్టర్‌పై వివాదం నెలకొంది. హనుమంతున్ని మానవుడిగా చూపిస్తూ మనోభావాలు దెబ్బతీశారని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది.

Complaint Against Rishab Shetty And Jai Hanuman Movie Director And Producers: తేజా సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్' సినిమా గతేడాది సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా 'జైహనుమాన్' (Jai Hanuman) రూపొందుతుండగా.. ఇది 'హనుమాన్'కు మించి ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపాడు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని ఐమ్యాక్స్ త్రీడీ ఫార్మాట్‌లో తీసుకురానుండగా.. 'హనుమాన్'లో హనుమంతుగా కనిపించిన తేజ కొత్త సినిమాలోనూ అదే పాత్ర పోషించనున్నారు. ఇక, ఆంజనేయ స్వామి పాత్రను కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) పోషించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. రాముడి విగ్రహాన్ని పట్టుకుని కూర్చున్నట్లుగా రిషబ్ శెట్టి ఫోటో ఉండగా ఇది సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.
కొత్త వివాదం
ఈ పోస్టర్‌పైనే కొత్తగా వివాదం నెలకొంది. హనుమంతుడి పాత్రను ఇంతకుముందు భారతీయ సినిమాలో నిర్మించిన అన్ని పౌరాణిక చిత్రాల కంటే భిన్నంగా చూపించారని కొందరు విమర్శిస్తున్నారు. 'జై హనుమాన్' సినిమాలో హనుమంతుడి రూపురేఖలే మారిపోయాయని.. ఆయన ముఖాన్ని సామాన్యుడి ముఖంగా చూపించారని పేర్కొంటున్నారు. హనుమంతుడిని కోతి రూపంలో చూపించలేదని.. ముఖం మార్చడం ద్వారా పాత్రను మార్చారని హైకోర్టు న్యాయవాది తిరుమలరావు అనే న్యాయవాది నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. పాత్రధారి రిషబ్ శెట్టి, చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హనుమంతుడి ఫోటో ఉందని.. పోస్టర్, టీజర్‌లు ఉపసంహరించుకునేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. 'హనుమంతున్ని ఇలా చూపించడాన్ని అంగీకరిస్తే ఇతర చిత్ర నిర్మాతలు దేవుళ్లను చిత్రీకరించడంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారు.' అని పేర్కొన్నారు.
కాగా, పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుపై మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవలే పాక్షికంగా ఉపశమనం పొందింది. ఈ కేసులో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వగా.. ఈ వ్యవహారంలో నిర్మాతలను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశాలు అందాయి. తాజాగా, ఇప్పుడు 'జై హనుమాన్' పోస్టర్‌పైనా ఫిర్యాదు అందడం సంచలనంగా మారింది. మరి ఈ వివాదంపై చిత్ర నిర్మాణ సంస్థ, దర్శక, నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
మరోవైపు, 'జై హనుమాన్' సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. హనుమాన్, జై హనుమాన్ రెండు చిత్రాలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్'లో భాగమే. కాగా, హనుమాన్ సినిమా తనకు విజయాన్ని మాత్రమే కాకుండా నమ్మకాన్ని సైతం ఇచ్చిందని ప్రశాంత్ వర్మ అన్నారు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటన్నదే 'జై హనుమాన్' సీక్వెల్‌లో కీలక అంశంగా తెలుస్తోంది.