Wayanad Landslide Victims: కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది ఆచూకీ లభించడం లేదు. ఆర్మీ సహా, సహాయక బృందాలు ఘటనా ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు వయనాడ్ బాధితులకు పలువురు సినీ ప్రముఖులు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. కేరళ సీఎం సహాయ నిధికి పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే నటుడు చియాన్ విక్రమ్ రూ.20 లక్షలు ఆర్థిక సాయం అందించగా, ఇప్పుడు సూర్య దంపతులు, కార్తి, రష్మిక మందన్నతో పాటు పలువురు విరాళాలు అందించారు. సూర్య, జ్యోతిక, కార్తి కలిసి రూ.50 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ‘యానిమల్’ బ్యూటీ రష్మిక రూ. 10 లక్షలు అందజేసింది.


గుండె పగిలింది- సూర్య


వయనాడ్ కొండ చరియలు విరిపడిన ఘటన తన హృదయాన్ని ముక్కలు చేసిందని నటుడు సూర్య ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కోసం ప్రార్థన చేయాలన్నారు. చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించిన ఆయన, శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడాలని ఆకాంక్షించారు.






హృదయవిదారక ఘటన- రష్మిక మందన్న


కేరళలో ప్రకృతి ప్రకోపం పట్ల రష్మిక మందన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆ దృశ్యాలు చూస్తుంటే గుండె విలవిలలాడుతోందని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.


బాధితులకు అండగా మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్


వయనాడ్ బాధితులకు మలయాళీ స్టార్ హీరోలు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ ఆపన్న హస్తం అందించారు. మమ్ముట్టి బాధితుల సాయం కోసం రూ. 25 లక్షలు ఆర్థిక సాయం చేశారు. దుల్కర్ సల్మాన్ రూ.15 లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించారు. అటు ఫహద్ ఫాజిల్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. మోహన్ లాల్, మంజు వారియర్, ఆసిఫ్ అలీ, టొవినో థామస్, నిఖిల్ విమల్, మాళవిక మోహనన్ తో పాటు పాటు పలువురు సినీ ప్రముఖులు వయనాడ్ బాధితులకు అండగా నిలిచారు. సీఎం సహాయన నిధికి విరాళం అందించారు. బాధితులకు అండగా నిలవాలని అందరినీ వేడుకున్నారు.










భారీ వర్షాల కారణంగా వయనాడ్‌లో వరదలు భీభత్సం సృష్టించాయి. మంగళవారం నాడు వరదలకు తోడు గాలి భీభత్సం సృష్టించింది. గాలి, వాన కారణంగా పెద్ద పెద్ద వృక్షాలు, వంతెనలు కూలిపోయాయి. వయనాడ్ లోని చాలా గ్రామాల్లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది మట్టిదిబ్బల కింద చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు మరో 200 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  


Also Read: తొలి సినిమాకే అవార్డు, మూడో సినిమాకే రూ. 100 కోట్ల గ్రాస్‌ - #NBK109 డైరెక్టర్ బాబీ బర్త్‌డే గ్లింప్స్ చూశారా?