చియాన్ విక్రమ్ అభిమానులకు గుడ్ న్యూస్. మణిరత్నం సినిమా పొన్నియిన్ సెల్వన్‌లో ఆదిత కరికాలన్ పాత్రకు ప్రశంసలు పొందిన తరువాత, చియాన్ తన తదుపరి సినిమాకు సంబంధించిన వర్క్ ప్రారంభించాడు. దీనిని ప్రస్తుతానికి #Chiyaan61 అని పిలుస్తున్నారు. దీనికి ఇంకా టైటిల్‌ను నిర్ణయించలేదు. రజనీకాంత్ నటించిన ‘కబాలి’, ‘కాలా’ చిత్రాల దర్శకుడు పా.రంజిత్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం స్వాతంత్రానికి ముందు కోలార్ గోల్డ్ ఫీల్డ్‌లోని (కేజీయఫ్) అణగారిన వర్గాలపై రూపొందుతుందని సమాచారం. ఇది బ్రిటీష్ కాలంలో K.G.Fలో పనిచేసిన నిజ జీవిత మైనర్ల కథ నుంచి ప్రేరణ పొందింది. ఈరోజు విక్రమ్ పాత్ర లుక్ టెస్ట్ జరిగింది. విక్రమ్ తన పాత్ర కోసం గడ్డం పెంచుకున్నాడు. మణిరత్నం  పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ సమయంలో అదే విధంగా కనిపించాడు.


చాలా సంవత్సరాలుగా గుర్తింపు, గౌరవం కోసం తహతహలాడుతున్న సమాజం చుట్టూ కథాంశం తిరుగుతుందని చిత్ర దర్శకుడు పా.రంజిత్ అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రంలో బలమైన, స్వతంత్రమైన మహిళ పాత్ర ఉంటుందని, ఇది విక్రమ్ పాత్రకు లవ్ ఇంట్రస్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇదో ఆసక్తికరమైన ప్రపంచం అని రంజిత్ చెప్పారు.


ఈ చిత్రం పాన్-ఇండియా ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. 3డీలో విడుదల అవుతుందని సమాచారం. అక్టోబరు 14న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ప్రారంభించి భారీ స్థాయిలో చిత్రీకరించనున్నారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.


ఈలోగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన చియాన్ విక్రమ్ ‘ధృవ నచ్చతిరమ్’ కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. విక్రమ్, సిమ్రాన్, ఐశ్వర్య రాజేష్, ఆర్.పార్తీబన్, సిమ్రాన్, దివ్యదర్శిని, వినాయకన్, అర్జున్ దాస్, రాధికా శరత్‌కుమార్ వంటి భారీ తారాగణంతో కూడిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈ చిత్రం. విక్రమ్ నటించిన రెండు సినిమాలు 2022లో థియేటర్లలో విడుదలయ్యాయి. అవే కోబ్రా, పొన్నియన్ సెల్వన్.