Chiyaan Vikram on SSMB 29: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా, పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘తంగలాన్’. పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా హైదరాబాద్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హీరో విక్రమ్ పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. పనిలో పనిగా రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


రాజమౌళితో మాట్లాడాను- విక్రమ్


అటు మహేష్ బాబు- జక్కన్న సినిమాలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై విక్రమ్ క్లారిటీ ఇచ్చారు.  రాజమౌళి గొప్ప డైరెక్టర్ అని చెప్పిన ఆయన, కొన్నిసార్లు తనతో మాట్లాడినట్లు చెప్పారు. “రాజమౌళి గొప్ప దర్శకుడు. ఆయనతో కొన్నిసార్లు మాట్లాడాను. మూవీ గురించే చర్చించాం. ఏదో ఒక సినిమా చేయాలి అనుకున్నాం. కానీ, మహేష్ సినిమా గురించి మాట్లాడలేదు” అని వివరణ ఇచ్చారు. మొత్తంగా రాజమౌళి దర్శకత్వంలో ఎప్పుడో ఒకప్పుడు సినిమా చేస్తాననే క్లూ ఇచ్చారు చియాన్.



కొన్ని సినిమాల కోసం రిస్క్ తప్పదు- విక్రమ్


గొప్ప సినిమాల కోసం రిస్క్ చేయడంలో తప్పులేదని విక్రమ్ వెల్లడించారు. ‘ఐ’ మూవీలా తంగలాన్’ సినిమా కోసం హెల్త్ ను రిస్క్ లో పెట్టారా? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. “ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. ఆరోగ్యం కన్నా డబ్బు, భోజనం ముఖ్యం కాదు. కానీ, నటుడిగా కొన్ని సినిమాల్లోని పాత్రలను బాగా ఎంజాయ్ చేస్తాను. అలాంటి సమయంలో ఆ పాత్ర కోసం కష్టపడటంలో ఏమాత్రం తప్పులేదు అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చారు.


 కేజీఎఫ్ కథాశంతో తెరకెక్కిన ‘తంగలాన్’


‘తంగలాన్’ చిత్రం కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఆంగ్లేయుల కాలం నాడు కేజీఎఫ్ లో బంగారం కోసం జరిపిన తవ్వకాలు, అక్కడి స్థానికుల నుంచి ఎదురైన సవాళ్ల చుట్టూ ఈ సినిమా తిరగనుంది. ఈ చిత్రంలో విక్రమ్ ఓ ఆదివాసీ తెగకు నాయకుడిగా కనిపించనున్నారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విక్రమ్, మాళవిక యాక్టింగ్ ప్రేక్షకులను అలరించాయి. ఈ చిత్రంలో  పార్వతి తిరువోతు, పశుపతి, డానియెల్ కాల్టగిరోన్, హరికృష్ణన్ అన్బుదురై కీలక పాత్రలు పోషించారు.  జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. గ్రీన్ స్టూడియోస్, నీలం ప్రొడక్షన్స్, జియో స్టూడియోస్ బ్యానర్లు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలకానుంది.


Read Also: కన్నప్పలో ప్రముఖ నటుడు దేవరాజ్‌  - ఆయన పాత్ర ఏంటో తెలుసా? పోస్టర్‌లోనే రివీల్‌



Also Read: రితేష్‌తో జెనీలియా ప్రేమ ఎలా మొదలైందో తెలుసా? - అచ్చం తమ తొలి మూవీ స్టోరీనే.. వీరి ప్రేమకథ..!