Chiranjeevi Vishwambhara Glimpse Out: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ వచ్చేసింది. ఆయన బర్త్ డే స్పెషల్‌‌గా అవెయిటెడ్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ 'విశ్వంభర' నుంచి గ్లింప్స్ వచ్చేసింది. 'బింబిసార' ఫేం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఓ విజువల్ వండర్‌గా ఆకట్టుకోనుంది.

చిన్నారి వాయిస్‌తో...

వీఎఫ్ఎక్స్‌కు అధిక ప్రాధాన్యమిస్తూ మూవీ తెరకెక్కినట్లు గ్లింప్స్‌ను బట్టి అర్థమవుతోంది. 'ఈ 'విశ్వంభర'లో అసలేం జరిగిందో ఈ రోజైనా చెబుతావా మురా' అంటూ ఓ చిన్నారి వాయిస్‌తో గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. 'ఓ సంహారం దాని తాలూకు యుద్ధం' అంటూ ఓ గంభీరమైన వాయిస్ వివరిస్తుండగా... ఆ చిన్నారి అర్థం కాలేదు అంటుంది. అప్పుడు అసలు కథ మొదలవుతుంది.

'ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది. అంతకు మించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బతికున్న ఓ సమూహం తాలూకా నమ్మకం. అలసిపోని ఆశయానికి ఊపిరి పోసే వాడు ఒకడు వస్తాడని... ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడని గొప్పగా ఎదురుచూసింది.' అంటూ భారీ ఎలివేషన్ ఇవ్వగా మెగాస్టార్ చిరంజీవి లుక్స్ అదిరిపోయాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

స్టోరీ అదేనా?

యమలోకం నుంచి బ్రహ్మలోకం వరకూ అన్నీ లోకాలను దాటి సత్యలోకాన్ని మూవీలో చూపించామని ఇదివరకూ ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వశిష్ట చెప్పారు. ఎంతోకాలంగా మారణ హోమం, యుద్ధంతో ఆందోళనకు గురవుతోన్న ఓ సమూహాన్ని రక్షించేందుకు వచ్చిన ఓ వీరుడి కథ ఇది అని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. అయితే, 'విశ్వంభర' అనేది ఓ లోకంగా చూపించినట్లు అర్థమవుతోంది. మరి మూవీలో మెగాస్టార్ పేరు రోల్ ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా... తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ పదింతలు హైప్ క్రియేట్ చేస్తోంది.

Also Read: మహేష్ బాబు సినిమా పబ్లిసిటీ కోసం హాలీవుడ్ లెజెండ్‌ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా

ఈ మూవీలో చిరు సరసన సౌత్ క్వీన్ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే 'నా సామిరంగ' ఫేం ఆషికా రంగనాత్ మరో హీరోయిన్. కునాల్ కపూర్ విలన్ రోల్ చేస్తుండగా... సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ భామ మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్‌తో అలరించబోతున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది.

వచ్చే ఏడాది రిలీజ్

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌కు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గురువారం అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్, సీజీ వర్క్స్ విషయంలో కాస్త ఆలస్యం కాగా బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు టీం ప్రకటించింది. ఆడియన్స్‌కు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే దర్శక నిర్మాతలు టైం తీసుకుంటున్నారని... అందుకే ఈ జాప్యం జరుగుతున్నట్లు చిరంజీవి వీడియోలో వెల్లడించారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఈ మూవీ నచ్చుతుందని స్పష్టం చేశారు.