Chiranjeevi Movie With Nag Ashwin: నాగ్ అశ్విన్ తెలుగులో తీసింది త‌క్కువ చిత్రాలే అయినా.. అన్ని సూప‌ర్ హిట్ సినిమాలే. 'మ‌హాన‌టి' సినిమాతో ఆయ‌న పేరు మారుమోగిపోయింది. ఇక ఇప్పుడు 'క‌ల్కీ 2898 ఏడీ' సినిమా కూడా సూప‌ర్ హిట్ అయ్యింది. నాగ్ అశ్విన్ తెలుగు సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లారంటూ ప్ర‌శంస‌లు వినిపిస్తున్నాయి. ఈ త‌రుణంలో చిరంజీవి గ‌తంలో మాట్లాడిన వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ మారింది. నాగ్ అశ్విన్ తో ‘పాత‌ళ‌భైర‌వి’ లాంటి సినిమా చేయాల‌ని ఉంది అంటూ ఆ వీడియోలో చెప్పారు చిరంజీవి. 


నాగ్ తో చేయాల‌ని ఉంది.. 


మెగాస్టార్ చిరంజీవి, ప్రొడ్యూస‌ర్ అశ్వనీద‌త్, స్వ‌ప్న ద‌త్ త‌దిత‌రులు క‌లిసి ఒక ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఆ ప్రెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కి ఆయ‌న ఇలా స‌మాధానం చెప్పారు. "ప‌ది నిమిషాల క్రిత‌మే.. స్వ‌ప్న అడిగింది అంకుల్ ఎప్పుడు మాతో సినిమా అని. నేనెప్పుడు కాద‌న్నాన‌మ్మా? ఇప్పుడు నా ఫోక‌స్ సినిమాల మీద పెట్టాను క‌దా? ఎప్పుడంటే అప్పుడు రెడీ అని చెప్పాను. నాకు అయితే అడ్వంచ‌ర‌స్ సినిమా తీయాల‌నుంది. మాయ‌లు, మంత్రాలు, యానిమ‌ల్స్ మాట్లాడ‌టం, 'పాతాళ‌భైర‌వి' లాంటి సినిమాలు చేయాల‌ని ఉంది. ఈ టెక్నాల‌జీని ఉప‌యోగించి మోడ్ర‌న్ సినిమా తియ్యాల‌ని. దానికి నాగ్ అశ్విన్ కూడా ఓకే అంటే నాకు ఓకే. ఇందాక నేను ‘పాత‌ళభైర‌వి’ లాంటి సినిమా తియ్యాల‌ని ఉందంటే స్వ‌ప్న వెంట‌నే నాగ్ వైపు చూసింది. మేం అనుకున్నాం అని. మీరు క‌న్ఫామ్ చేస్తున్నారు" అంటూ అశ్వినీ ద‌త్ వైపు చూసి చెప్పారు చిరంజీవి.


క‌థ‌లు సెట్ అవ్వ‌లేదు.. 


ఇదే విష‌యంపై అశ్వినీ ద‌త్ కూడా మాట్లాడుతూ.. "రెండేళ్ల నుంచి వైజ‌యంతి మూవీస్ లో మెగాస్టార్ గారి సినిమా చేయాల‌ని ఉంది. ఆయ‌న మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఎన్నో క‌థ‌లు విన్నారు. క‌రెక్ట్ గా క‌థ త‌యారు చేయ‌లేక‌పోయాం. ఇప్పుడు నాగ్ మొద‌లుపెట్టాడు కాబ‌ట్టి క‌చ్చితంగా ఒక మంచి సినిమా చేద్దాం. ‘పాతాళ భైర‌వి’ లాంటి సినిమా ఒక‌టి అనుకున్నాం. కానీ త‌యారు అవ్వ‌డానికి ఒక సంవ‌త్స‌రం ప‌డుతుంది అని నాగ్ అన్నాడు. అది వాళ్లే చెప్తారు తొంద‌ర్లో. టైం ప‌డుతుంది కానీ, క‌చ్చితంగా చేద్దాం" అని అశ్వినీ ద‌త్ అన్నారు. దీంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. నాగ్ అశ్విన్, మెగాస్టార్ కాంబినేష‌న్ అంటే క‌చ్చితంగా బాక్సాఫీసులు బ‌ద్ద‌లే అంటూ కామెంట్లు పెడుతున్నారు. పాతాళ భైర‌వి లాంటి సినిమా అంటే క‌చ్చితంగా బొమ్మ సూప‌ర్ డూప‌ర్ హిట్టు. అప్పుడెప్పుడో చెప్పారు ఇంక మొద‌లుపెట్టండి బాసూ అంటూ ఆ వీడియోని వైర‌ల్ చేస్తున్నారు. 



'క‌ల్కీ'తో అద్భుతం.. 


నాగ్ అశ్విన్, ప్ర‌భాస్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన 'క‌ల్కీ' సూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా ఈ సినిమా బంప‌ర్ హిట్ గా నిలిచింది. ఇప్ప‌టికే రూ. 290 కోట్లు వ‌సూళ్లు సాధించింది ఈ సినిమా. ఇక ఈ సినిమా విజువ‌ల్ వండ‌ర్. సైన్స్ ఫిక్ష‌న్ కావ‌డంతో వీఎఫ్ ఎక్స్ ప్ర‌ధాన పాత్ర పోషించింది. దీంతో ఇప్పుడిక ఈ టెక్నాల‌జీతో ‘పాత‌ళ భైర‌వి’ లాంటి సినిమా తీస్తే.. ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటున్నారు సినీ విశ్లేష‌కులు. మ‌రి చిరంజీవి కోరిక‌, నాగ్ అశ్విన్ కోరిక ఎప్పుడు నెర‌వేరుతుందో చూడాలి. 


Also Read: ‘కల్కి 2898 AD’పై స్పందించిన విజయ్ దేవరకొండ - తన ఇన్‌స్టాగ్రామ్ డీపీని సైతం మార్చేసిన రౌడీ బాయ్