మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే 'మెగా 157' ప్రాజెక్టుకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న UV క్రియేషన్స్ సంస్థ కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టును రిలీజ్ చేస్తూ మెగాస్టార్ కి బర్త్ డే విషెస్ ను అందజేసింది. ఈసారి మెగాస్టార్ ఓ హిస్టారికల్ సోషియో ఫాంటసీ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నట్టు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాకి 'బింబిసార' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
‘‘ఈసారి విశ్వాన్ని దాటి మెగా మాస్ ఉండబోతోంది, 5 ఎలిమెంట్స్ మెగాస్టార్ అనే ఎలిమెంటల్ ఫోర్స్ కోసం ఏకమవుతున్నాయి’’ అంటూ తమ పోస్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు.. పంచభూతాలను సూచిస్తూ డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకోవడంతోపాటు ఒక్కసారి గా ఈ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ సినిమాని UV క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో మొదలుకానునట్లు సమాచారం. మరోవైపు మెగాస్టార్ సుమారు 20 సంవత్సరాల తర్వాత సోషియో ఫాంటసీ కథతో కూడిన సినిమా చేస్తుండడం గమనార్హం.
గతంలో మెగాస్టార్ హీరోగా సోషల్ ఫాంటసీ నేపథ్యంలో 'అంజి' సినిమా వచ్చింది. కానీ ఊహించని విధంగా ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ వశిష్ట తో సోషియో ఫాంటసీ మూవీ చేస్తుండటంతో ఈ ప్రాజెక్టు పై అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోతున్నాయి. దర్శకుడు వశిష్ట తన మొదటి సినిమా 'బింబిసార' సోషల్ ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. మరి మెగాస్టార్ తో చేస్తున్న ఈ ప్రాజెక్టు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. కాగా ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య' తో భారీ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ రీసెంట్ గా 'భోళాశంకర్' సినిమాతో ప్రేక్షకుల్ని నిరాశపరిచారు.
మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని రూపొందించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. అంతేకాదు 'బోలా శంకర్' రిజల్ట్ తో 'సోగ్గాడే చిన్నినాయన' దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో మెగాస్టార్ చేయాల్సిన 'బ్రో డాడి' రీమేక్ కూడా ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు చిరంజీవ 156 ప్రాజెక్టును ఆయన కూతురు సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై రూపొందనున్న ఈ సినిమాకి ఇంకా డైరెక్టర్ ఎవరో తెలియాల్సి ఉంది.
Also Read : యోగి ఆదిత్య నాథ్ కాళ్ళు మొక్కడంపై ఎట్టకేలకు స్పందించిన రజినీకాంత్