Chiranjeevi about Bengaluru Water Crisis: ప్రస్తుతం బెంగళూరులో నీటి సమస్య ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం ఈ నీటి సమస్య నుంచి తప్పించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి బెంగుళూరులో కూడా ఒక ఇల్లు ఉంది. అక్కడ కూడా నీటి సమస్యలు మొదలవ్వడంతో అసలు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అని ఫ్యాన్స్‌తో కొన్ని చిట్కాలను పంచుకున్నారు. ఈ విషయంపై ఏం చేస్తే బాగుంటుందో ఆయన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. కన్నడలో ఆయన చేసిన ట్వీట్ చాలామందికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు.


ఈరోజు బెంగుళూరు, రేపు ఇంకెక్కడైనా..


‘జీవించడానికి నీరు అనేది చాలా ముఖ్యమని అందరికీ తెలిసిందే. అలాంటి నీటి కొరత రోజూవారీ జీవితాలను కష్టంగా మార్చుతుంది. ప్రస్తుతం బెంగుళూరులో నీటి కొరత సమస్య ఉంది. రేపటి రోజున ఈ సమస్య ఇంకెక్కడైనా ఎదురవ్వొచ్చు. అందుకే నీటిని నిల్వ ఉంచే బావులను ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. బెంగుళూరులోని ఫార్మ్ హౌజ్‌లో నేనేం చేశానో మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను’ అంటూ తన ట్విటర్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసి, అసలు అవి ఏంటి, వాటి ఉపయోగం ఏంటని చెప్పుకొచ్చారు చిరు.


ఇంకుడు గుంతకంటే ఇదే బెటర్..


‘20 నుంచి 36 అడుగు లోతులో బావులను రీచార్జ్ బావులను ఏర్పాటు చేయాలి. బయట ఉన్న నీరు నేరుగా లోపలికి వెళ్లే విధంగా అక్కడక్కడా సరిపడా స్లోప్స్‌ను ఏర్పాటు చేయాలి. ప్రతీ బావికి ఒక ఫిల్టర్ సిస్టమ్‌ను జతచేయాలి. ఇంకుడు గుంతలకంటే రీచార్జ్ బావులు చాలా మెరుగ్గా పనిచేస్తాయి. ఎక్కువ నీటిని నిల్వ ఉంచగలుగుతాయి. ఎన్నో పొరల్లో నీరు పారేలా చేసి భూమి లోపలికి వెళ్లేలా చేస్తాయి. అంతే కాకుండా నేను స్వయం సమృద్ధి వ్యవసాయ పద్ధతిని కూడా ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. ఇది పర్యావరణాన్ని పునరుజ్జీవనం చేయడానికి ఉపయోగపడుతుంది. స్వయం సమృద్ధి వ్యవసాయం వల్ల నీటి కొరత తగ్గిపోతుంది’ అని చిరంజీవి సలహా ఇచ్చారు.






కరెక్ట్ అంటున్న పర్యావరణవేత్తలు..


‘ఈ చిట్కాలను ఫాలో అవ్వడం వల్ల మనం నీటిని ఎక్కువగా నిల్వ ఉంచుకోవచ్చు. వర్షపు నీటిని ఎక్కువగా నిల్వ ఉంచే అవకాశం ఉంటుంది. ఎకో ఫ్రెండ్లీ ఇళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ ఫోటోలను మీతో షేర్ చేసుకుంటున్నాను’ అంటూ బెంగుళూరు ఫార్మ్ హౌజ్‌లో ఆయన నీటి కొరతను తగ్గించడానికి ఏమేమి చేశారో.. దానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేశారు చిరంజీవి. పర్యావరణవేత్తలు సైతం చిరు చెప్పింది కరెక్ట్‌గా ఉందంటూ.. ఇప్పటికైనా ఎవరి ఇంటి వద్ద వారు బావులను ఏర్పాటు చేసుకుంటే మంచిదంటూ సలహాలు ఇస్తున్నారు.


Also Read: అనుపమా హర్ట్ అయ్యింది, పనీ పాటా లేనోళ్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు - సిద్దు జొన్నలగడ్డ ఆగ్రహం