Manchu Pallaki Flashback: డైరెక్టర్ వంశీ.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినీ చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. గోదారి యాసకు, భాషకు, సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. ఇప్పటికీ ఆయన సినిమాల కోసం ఎదురు చూసే సినీ ప్రియులు ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దర్శకుడిగానే కాకుండా.. కథా రచయితగా, సంగీత దర్శకుడిగా, గాయకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. సినీ రంగంలోనే కాదు, సాహితీ రంగంలోనూ తిరుగులేని పేరు సంపాదించుకున్నారు. నవలా రచయితగా సాహిత్యాభిమానులకు సుపరిచితుడయ్యారు. అయితే గత కొన్నేళ్లుగా వంశీ నుంచి పెద్దగా చిత్రాలు రావడం లేదు. 


వంశీ తాజాగా తనని డైరక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసిన 'మంచు పల్లకి' మూవీకి సంబంధించిన విశేషాలను తన అభిమానులతో పంచుకున్నారు. వంశీ తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని, రాజేంద్ర ప్రసాద్, నారాయణరావు, సాయిచంద్ ప్రధాన పాత్రలు పోషించారు. 1982 నవంబర్ 19న విడుదలైన ఈ సినిమా యువతను ఆకట్టుకుంది. నటీనటులందరికీ మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది. అయితే ఈ సినిమాలో ఒక పాటని చెన్నైలోని గుడిలో మొదలు పెట్టి, మణిమంగళం, హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ లో మూడు షిఫ్టులుగా చిత్రీకరించి సాయంత్రానికి సాంగ్ షూటింగ్ పూర్తి చేసినట్లు వంశీ తాజాగా వెల్లడించారు. కేవలం ఒక్క రోజులోనే పాట పూర్తవడంతో చిరంజీవి ఆశ్చర్యపోయారని తెలిపారు. అలానే సుహాసిని పోషించిన గీత పాత్రకు సరిత డబ్బింగ్ చెప్పడం గురించి, పిట్టగోడ మీద ఐదుగురు యువకులను పెట్టి క్లైమాక్స్ సన్నివేశాన్ని చిత్రీకరించడంపై వంశీ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. 


''సినిమాలో చిరంజీవి భయంకరంగా అరుస్తూ ఏడ్చే ఓ సోలో సీన్ షూటింగ్ రాత్రి 2 గంటల తర్వాత ప్లాన్ చేసాం. షిఫ్ట్ లో జనమంతా చాలా సైలెంట్ గా ఉన్నారు. ఎలాంటి చప్పుళ్ళు లేకుండా అందరూ నిశబ్దంగా పనిచేస్తున్నారు. పక్క గదిలో ఉన్న చిరంజీవిని పిలుద్దాం అని నేను వెళ్లేసరికి.. అక్కడ ఆయన కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఆయన ముందు స్టిల్ కెమెరామెన్ కూర్చొని తలనిమురుతూ ఉన్నాడు. ‘‘ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయండీ.. పాపం మీకు ఏమున్నాయో, ఈ టైంలో ఏం గుర్తొచ్చి ఏడుస్తున్నారో. ఊరుకోండి’’ అని సముదాయిస్తున్నాడు. అయినా చిరంజీవి వినకుండా ఏడుస్తూ ఉండటంతో ఆయన తెల్లచొక్కా అంతా తడిసిపోయింది. అదంతా చూసి అసలు ఏమైందో నాకు అర్థం కాలేదు. కొన్ని క్షణాల తర్వాత చిరంజీవి ఆ స్టిల్ కెమెరామెన్ ను ఒక తోపు తోసి ‘‘సీన్ అంతా ఒకే షాట్ లో అయిపోవాలని నేను సెపరేట్ గా ఇక్కడ కూర్చొని రిహాసల్స్ చేసుకుంటుంటే, నీ కాకి గోలేంట్రా.. అర్జెంట్ గా బయటకు వెళ్ళు’’ అంటూ నావైపు చూసారు. నేను వెంటనే షాట్ రెడీ సార్ అన్నాను. అలాగా ఆ షాట్ తీసేసాం'' అని వంశీ వివరించారు. 



'మంచు పల్లకి' సినిమా కథేంటంటే... శేఖర్, హరి, వాసు, కుమార్, గాంధీ (చిరంజీవి, నారాయణ రావు, రాజేంద్ర ప్రసాద్, సాయిచంద్, గిరీష్) ఉద్యోగాల వేట సాగిస్తూ, ఓ కాలనీలోని పిట్టగోడపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అదే వీధిలోకి గీత (సుహాసిని) అనే యువతి కొత్తగా వస్తుంది. తొలి చూపులోనే ఆమె ఈ ఐదుగురిని ఆకర్షిస్తుంది. గీత మంచితనాన్ని చూసి శేఖర్ (చిరంజీవి) ఆమెను ఆరాధించడం మొదలు పెడతాడు. ఆ తరువాత వీరంతా ఫ్రెండ్స్ గా మారతారు. గీత రాకతో ఆ ఐదుగురి జీవితాలు మారిపోతాయి. అందరూ తమ కాళ్ళపై తాము నిలవాలని నిర్ణయించుకొని తగిన ఉద్యోగాలు సంపాదించుకుంటారు. గీతని ప్రేమించిన శేఖర్ ఆమెకు క్యాన్సర్ అనీ, ఎంతోకాలం బతకదనీ తెలుసుకొంటాడు. ఒక వైపు వరకట్నం సమస్యతో వాసు (నారాయణ రావు) చెల్లెలు పెళ్ళి ఆగిపోతుంది. చివరకు గీత కోరిక మేరకు శేఖర్ తన మిత్రుడు వాసు చెల్లెల్ని వివాహం చేసుకుంటాడు. గీత పెళ్ళిమండపంలోనే పడిపోతుంది. అందరినీ బాధపెడుతూ గీత నవ్వుతూ కన్నుమూస్తుంది. ఈ ఐదుగురు మిత్రులు ఎప్పుడూ కలుసుకొనే పిట్టగోడపైకి మరో ఐదుగురు కుర్రాళ్ళు వచ్చి కూర్చుని ముచ్చటించుకుంటూండగా ఈ చిత్రం ముగుస్తుంది.


Also Read: నేరుగా ఆ ఓటీటీలోకి ‘వళరి’ - ష్.. దెయ్యం వస్తోందంటూ భయపెడుతోన్న ట్రైలర్!