హీరోలు.. నిర్మాతలుగా మారి ఇతర చిన్న హీరోలను, దర్శకులను ఎంకరేజ్ చేయడం కామన్‌గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్లుగా చలామణి అవుతున్న చాలామంది హీరోలు.. తమ కెరీర్‌లో ఏదో ఒకసారి నిర్మాతలుగా బాధ్యతలు నిర్వర్తించినవారే. అలా ఓవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా బిజీ అవుతున్నారు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటికే రవితేజ.. హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారో.. నిర్మాతగా కూడా అంతే బిజీగా గడిపేస్తున్నారు. తాజాగా ఆయన సొంత ప్రొడక్షన్ హౌజ్.. ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై ‘ఛాంగురే బంగారురాజా’ అనే చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ సైలెంట్‌గా షూటింగ్‌ను పూర్తి చేసుకోవడం మాత్రమే కాకుండా.. విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసింది.


నిర్మాతగా బిజీ..
రవితేజ.. ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే నిర్మించడానికి ఇష్టపడతారు. ఇక తాజాగా విడుదలయిన ‘ఛాంగురే బంగారురాజా’ పోస్టర్ చూస్తుంటే ఇది కూడా ఒక కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమే అని అర్థమవుతోంది. రవితోజతో పాటు శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రోడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్టీ టీమ్ వర్క్స్‌తో పాటు ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌ కూడా ‘ఛాంగురే బంగారురాజా’ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ విడుదల తేదీ.. సెప్టెంబర్ 15 అని టీమ్.. తాజాగా పోస్టర్‌తో ప్రకటించింది. వినాయక చవితి సందర్భంగా ఇప్పటికీ ఎన్నో తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండగా.. ఇప్పుడు ‘ఛాంగురే బంగారురాజా’ కూడా అధికారికంగా ఆ రేసులో జాయిన్ అయ్యింది.


కత్తి, గన్, లాఠీ.. అన్నీ కలిపి..
‘ఛాంగురే బంగారురాజా’ పోస్టర్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంది. సంకెళ్లతో కార్తిక్ రత్నం ఉండగా.. తనకు కత్తి చూపిస్తూ ఆలి నిలబడ్డాడు. ఆలి తలకు గన్ గురిపెడుతూ సత్య నిలబడ్డాడు. సత్యను ఆపుతూ పోలీస్ యూనిఫార్మ్‌లో గోల్డీ నిస్సీ లాఠీతో ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఇది ఒక క్రైమ్ కామెడీ అని అర్థమవుతోంది. అందులో ఈ నలుగురు కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘ఛాంగురే బంగారురాజా’లో హీరోగా కార్తిక్ రత్నం నటించగా.. తనకు హీరోయిన్‌గా గోల్డీ నిస్సీ కనిపించనుంది. ఇప్పటికే ‘C/o కంచరపాలెం’, ‘నారప్ప’ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ రత్నం.. చాలాకాలం తర్వాత మళ్లీ హీరోగా ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇప్పటికే విడుదలయిన ‘ఛాంగురే బంగారురాజా’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.


కాస్ట్ అండ్ క్రూ విషయానికొస్తే..
‘ఛాంగురే బంగారురాజా’ను డైరెక్ట్ చేయడంతో పాటు కథను కూడా తానే సమకూర్చుకున్నాడు సతీష్ వర్మ. కృష్ణ సౌరభ్.. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం కానున్నాడు. కార్తీక్ వున్నవా.. ఎడిటర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించాడు. కథకు తగినట్టుగా క్రైమ్ కామెడీ డైలాగులను రాసే బాధ్యత జనార్ధన్ పసుమర్తి అందుకున్నారు. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే సుందర్ ఎన్‌సీ.. ‘ఛాంగురే బంగారురాజా’లోని ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా చూపించారు. రవిబాబు, సత్య, ఎస్తర్ నోరోన్హా, అజయ్ లాంటి నటీనటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


Also Read: 'జవాన్'లో షారుఖ్ డూప్‌గా నటించింది ఈయనే - సేమ్ టు సేమ్ షారుఖ్‌లా


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial