ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో శ్రీకాంత్. ప్రస్తుతం ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక ఇప్పటికే సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై చాలా కాలమే అవుతుంది. ఈరోజు రోషన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త మూవీ 'ఛాంపియన్' నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేసి,స్పెషల్ గా తమ హీరోను విష్ చేశారు మేకర్స్.
'ఛాంపియన్' గ్లిమ్స్... గేమ్ బిగిన్స్
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కొత్త చిత్రం 'ఛాంపియన్'. ఈ సినిమాను స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిం బ్యానర్లపై ప్రియాంక దత్, జీకే మోహన్, జెమినీ కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. 2023లో రోషన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీని అనౌన్స్ చేశారు. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు 2024 ఆగస్టులో సెట్స్ పైకి వెళ్ళింది. అయితే ఈ మూవీలో నటిస్తున్న హీరో రోషన్ తప్ప మిగతా వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.
తాజాగా రోషన్ పుట్టినరోజు సందర్భంగా 'ఛాంపియన్' నుంచి చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసి ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఆ గ్లిమ్స్ లో రోషన్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో దర్శనమిచ్చాడు. ఫుట్ బాల్ ఆధారంగా ఈ మూవీ రూపొందదుతోందని గ్లిమ్స్, టైటిల్ ద్వారా కన్ఫామ్ చేశారు. అలాగే ఈ టీజర్ చూస్తుంటే మూవీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది అనే విషయం స్పష్టంగా కన్పిస్తోంది. కాగా ఇందులో రోషన్ సరికొత్త లుక్ లో కనిపించాడు. సేమ్ శ్రీకాంత్‌లా ఉన్నాడని కొందరు అంటున్నారు.
రోషన్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్
2016లో 'నిర్మలా కాన్వెంట్' అనే సినిమాతో రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ రోషన్ కి బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డు దక్కింది. ఈ మూవీని నాగార్జున నిర్మించడం విశేషం. ఇక ఐదేళ్ల గ్యాప్ తర్వాత 2021లో 'పెళ్లి సందడి' సినిమాతో రోషన్ మళ్ళీ తెరపై మెరిశాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. శ్రీలీల ఈ మూవీతోనే హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఇప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రోషన్ 'ఛాంపియన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే రోషన్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'వృషభ'లో కీలకపాత్రను పోషించబోతున్నాడు. ఇందులో ఆయన మోహన్ లాల్ తనయుడిగా కనిపించబోతున్నాడు.