'బిచ్చగాడు' మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో విజయ్ ఆంటోని. ఆయన కెరీర్ లో 25వ సినిమాగా తెరకెక్కుతోంది 'భద్రకాళి'. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో విడుదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది.
పిల్లి కూడా ఒక రోజు పులి అవును
మల్టీ టాలెంటెడ్ తమిళ హీరో విజయ్ ఆంటోనీ. ఆయన హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, లిరిసిస్ట్ గా, ఎడిటర్ గా సత్తా చాటుతున్నారు. ఆయన ఇప్పుడు తన కెరీర్‌లో 25వ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ 'భద్రకాళి' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి హైప్ పెంచింది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని సమర్పణలో అరుణ్ ప్రభు దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతోంది.
తాజాగా 'భద్రకాళి' సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. "పిల్లి కూడా ఒక రోజు పులి అవును... అబద్దం, అహంకారం అంతం అవును" అనే డైలాగ్ తో ఆ టీజర్ మొదలైంది. అలాగే టీజర్ చూశాక ఇందులో విజయ్ ఆంటోని ఎలాంటి పాత్రను పోషిస్తున్నాడు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. ఇందులో విజయ్ ఆంటోని ఫ్యామిలీ మెన్ లా, గ్యాంగ్ స్టర్ లా డ్యూయల్ షేడ్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడు. అలాగే ఇందులో హీరో ఐపీఎస్ అధికారిగా కన్పించబోతున్నట్టు టీజర్ ను చూస్తే అర్థం అవుతోంది. మరి సినిమాలో కిట్టు ఎవరు? అనే ఆసక్తిని రేకెత్తించే విధంగా 'భద్రకాళి' టీజర్ ను మేకర్స్ కట్ చేశారు.
Also Read: 'కోర్టు' రివ్యూ: థియేటర్లలో వాదనలు నిలబడతాయా? పడిపోతాయా? నాని సమర్పణలో వచ్చిన సినిమా ఎలా ఉందంటే?
190 కోట్ల కుంభకోణమే ప్రధానాంశం
'భద్రకాళి' సినిమా 190 కోట్ల కుంభకోణం చుట్టూ తిరుగుతుంది. టీజర్ చివర్లో "ఇది కేవలం ఆరంభం మాత్రమే" అంటూ హీరో చెప్పే డైలాగ్ తో ఎండ్ కార్డ్ పడింది. విజయ్ ఆంటోని ఈ చిత్రంలో స్టైలీష్‌గా, యాక్షన్ హీరోగా అదరగొట్టబోతున్నాడు. ఇందులో ఆయన హీరోగా నటించడం మాత్రంఏ కాదు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ షెల్లీ కాలిస్ట్ విజువల్స్, విజయ్ ఆంటోనీ ఆర్ఆర్, రేమండ్ డెరిక్ క్రాస్టా ఎడిటింగ్, రాజశేఖర్ కంపోజ్ చేసిన ఫైట్స్ వంటి టీజర్లో ఉన్న హైలెట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. 'భద్రకాళి' సినిమాలో సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, వాగై చంద్రశేఖర్, మాస్టర్ కేశవ్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
'భద్రకాళి' సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీ టైటిల్ విషయంలోనే వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. విజయ్ ఆంటోని, శివ కార్తికేయన్ ఇద్దరూ 'పరాశక్తి' అనే టైటిల్ తో మూవీని ప్రకటించారు. కానీ చివరకు విజయ్ ఆంటోని వెనక్కి తగ్గి, మూవీకి 'భద్రకాళి' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.