Celina Jaitley About Trollings On Her Post Operation Sindoor: ఉగ్ర మూకల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా.. శత్రు దేశం వెన్నులో వణుకు పుట్టేలా భారత్.. పాక్‌పై 'ఆపరేషన్ సింధూర్' సైనిక చర్యను చేపట్టిన సంగతి తెలిసిందే. దీన్ని ప్రశంసిస్తూ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. సైనికులకు సెల్యూట్ చేస్తూ ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ సైతం భారత సాయుధ దళాలను ప్రశంసిస్తూ వరుస పోస్టులు పెట్టారు.

నచ్చని వాళ్లు అన్ ఫాలో చెయ్యండి

ఉగ్రవాదానికి తాను ఎప్పుడూ వ్యతిరేకినేనని.. భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'ను సెలీనా ప్రశంసించారు. దీంతో ఆమెకు బెదిరింపులు వచ్చాయి. ట్రోలింగ్ చేయడం సహా భారత్‌ను ప్రశంసిస్తే అన్ ఫాలో చేస్తామంటూ కొందరు ఆమెను బెదిరించారు. తాజాగా ఈ ట్రోల్స్‌పై ఆమె స్పందించారు. తన ధోరణి నచ్చకుంటే వాళ్లు అన్ ఫాలో చేసుకోవచ్చని అన్నారు.

భారత్ గురించి మాట్లాడితే అన్ ఫాలో చేస్తామని కొందరు అంటున్నారని.. అలా బెదిరించే వారి కోసమే ఈ పోస్ట్ పెడుతున్నట్లు సెలీనా చెప్పారు. 'నా దేశం కోసం నిలబడినందుకు నేను ఎప్పటికీ సారీ చెప్పను. అన్యాయంగా అమాయకుల ప్రాణాలు తీస్తున్నా కూడా నేను స్పందించకుండా మౌనంగా ఉండలేను. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీశారు. హింసను సమర్థిస్తూ.. దాన్ని ప్రోత్సహించే వారి వైపు నేను ఎప్పుడూ నిలబడను.

భారత్‌పై నాకున్న ప్రేమ మిమ్మల్ని బాధ పెడితే.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వినిపించే నా మాటలు మీరు వినలేకపోతే.. నన్ను ఫాలో కావడం మానేయండి. నేను శాంతి కోసం మాట్లాడతాను. సత్యం కోసం నిలబడతాను. ఎప్పుడూ నా సైనికుల వెంటే ఉంటాను. నా సైనికులు పేరు, మతం అడగకుండానే రక్షిస్తారు. మీ అందరి ట్రోల్స్, బెదిరింపులు నేను గమనిస్తూనే ఉన్నాను. నేను ఇలాంటి వారిని క్షమించను. జైహింద్.' అంటూ తన ఇన్ స్టా పోస్టులో రాసుకొచ్చారు.

Also Read: 'ఆపరేషన్ సింధూర్' మూవీ - సారీ చెప్పిన బాలీవుడ్ డైరెక్టర్.. అసలు కారణం ఏంటంటే?

బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ 2004లో వచ్చిన మంచు విష్ణు 'సూర్యం' మూవీతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం. ఆమె తండ్రి కల్నల్ వి.కె.జైట్లీ ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్‌గా పని చేశారు. తల్లి మీతా భారత సైన్యంలో నర్సుగా పని చేశారు. 'సూర్యం' మూవీ తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. ఆ తర్వాత పలు బాలీవుడ్ మూవీస్‌లో నటించారు. 2011లో పీటర్ హాగ్‌ను పెళ్లి చేసుకుని.. ఆ మరుసటి ఏడాదే కవల పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సాయుధ దళాలను ప్రశంసిస్తూ ఆమె పోస్టులు పెట్టారు.