Bollywood Celebrities Reaction On Operation Sindoor: 'ఆపరేషన్ సింధూర్'.. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. శత్రు దేశం గుండెల్లో వణుకు పుట్టించేలా.. ఉగ్ర మూకలను మట్టి కరిపించేలా భారత సైన్యం చేపట్టిన సైనిక చర్యకు దేశమంతా జేజేలు పలుకుతోంది. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ కుటిల బుద్ధితో చేస్తోన్న దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. దీనిపై బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించారు. సైనికులకు సెల్యూట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.
పాకిస్తాన్‌కు రణవీర్ స్ట్రాంగ్ వార్నింగ్
ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని మా జోలికి వస్తే వదిలిపెట్టమని బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ (Ranveer Singh) పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 'ఆపరేషన్ సింధూర్'కు (Operation Sindoor) సంబంధించిన ఇమేజ్ పంచుకున్న ఆయన.. ఆపరేషన్‌లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్నందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. 'ఎవరి పనులు వాళ్లు చేసుకునే వారిని మేం ఇబ్బందిపెట్టం. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టం. మన సాయుధ దళాలకు సెల్యూట్.' అని పేర్కొన్నారు.
దశాబ్దాల బాధకు ఆన్సర్
మనది దూకుడు కాదని.. దశాబ్దాల బాధకు ఆన్సర్ అని స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అన్నారు. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూపై దాడులకు సంబంధించిన విజువల్స్ చూసి దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. 'ఇప్పటివరకూ నేను ఎప్పుడూ ఇలాంటి ఆందోళన అనుభవించలేదు. ఇన్ని రోజులు విదేశాల్లో ఇలాంటి దాడులు జరుగుతుంటే శాంతిని పాటించాలని కోరుకున్నాం. ఇప్పుడు అదే పరిస్థితి మనకు వచ్చింది. భారత్ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వదు. దశాబ్దాలుగా ఇలాంటి దాడులు ఎదుర్కొన్న తర్వాత.. ఇప్పుడు తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.
మనది దూకుడు కాదు. దశాబ్దాల బాధకు సమాధానం. మన సాయుధ దళాలు శత్రు దేశంపై వీరోచిత పోరాటం చేస్తున్నాయి. మనల్ని, మన భూమిని, మన సార్వభౌమత్వాన్ని మన సైనికులు రక్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా ఐక్యంగా ఉంటూ వారికి మద్దతు ఇద్దాం. ఉద్రిక్తతల్లో మన అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నన్ను బాధిస్తోంది. త్వరలోనే దీనికి శాశ్వతంగా ముగింపు పలకాలని ఆశిస్తున్నా. మన సైనికుల కోసం ప్రార్థిస్తుంటాను.' అని జాన్వీ అన్నారు.
Also Read: హ్యాపీ బర్త్ డే విజ్జీ - విజయ్ దేవరకొండకు రష్మిక క్యూట్ విషెష్.. ఒకే రోజు ఫ్యాన్స్‌కు రెండు గిఫ్ట్స్
ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు 'ఆపరేషన్ సింధూర్'పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, అక్షయ్ కుమార్, నిమ్రత్ కౌర్, రితేశ్ దేశ్‌ముఖ్ సైనికుల సేవలను కొనియాడారు. త్రివిధ దళాలకు సెల్యూట్ చేశారు. పలువురు ఇండస్ట్రీ తరఫు నుంచి సైనికులకు సాయం అందిస్తున్నారు. 'సింగిల్' సినిమా వసూళ్లలో వచ్చిన ప్రాఫిట్స్ నుంచి కొంత భాగం సైనికులకు ఇవ్వనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అటు.. తన క్లాత్ బ్రాండింగ్ రౌడీ వేర్ సేల్స్‌లో వచ్చే లాభాల్లో కొంతవాటాను సైన్యానికి విరాళంగా ఇవ్వనున్నట్లు విజయ్ దేవరకొండ ప్రకటించారు.