CBFC Reaction About Vijay Jana Nayagan Movie Leakage Issue : దళపతి విజయ్ జన నాయగన్ మూవీ రిలీజ్‌కు ముందే ఆన్ లైన్‌లో లీక్ కావడం ఇండస్ట్రీనే కుదిపేసింది. ఈ ఘటనతో అటు కోలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్, మూవీ టీం, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఈ అంశంపై సెన్సార్ బోర్డు స్పందించింది. మూవీ లీక్ వార్తలు నిరాధారమని స్పష్టం చేసింది.
'నిర్మాత వద్దే KDM'
'జన నాయగన్' మూవీ లీక్ అయ్యిందన్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్న CBFC... తమ కఠినమైన భద్రతా ప్రోటాకాల్స్ గురించి వివరించింది. ఈ మేరకు ఓ వివరణ జారీ చేసింది. PIB రిపోర్ట్ ప్రకారం... 'సర్టిఫికేషన్ కోసం సమర్పించిన అన్నీ థియేట్రికల్ చిత్రాల కోసం మేము ఓ సురక్షితమైన కీ డెలివరీ మెసేజ్ (KDM) వ్యవస్థను ఉపయోగిస్తున్నాం. ఇది సినిమా కంటెంట్‌కు యాక్సెస్ పాస్వర్డ్ ద్వారా రక్షించేలా చూస్తుంది. KDM ప్రత్యేకంగా నిర్మాత వద్దే ఉంటుంది.' అంటూ రిపోర్ట్‌లో పేర్కొంది.
జన నాయగన్ మూవీకి సంబంధించి డిజిటల్ సినిమా ప్యాకేజీ (DCP) మార్చి 17న ముంబైలో అప్లికెంట్‌కు తగిన రిసీప్ట్‌తో అధికారికంగా అందజేసినట్లు CBFC తన ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. అప్పటి నుంచి DCP అతని ఆధీనంలోనే ఉందని తెలిపింది.
Also Read : కూతురి కోసం ఓ తండ్రి పడే ఆరాటం - ఓటీటీలోకి వచ్చేసిన 'చిట్టి తల్లి'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
బిగ్ ట్విస్ట్ ఏంటంటే?
మూవీ లీక్‌పై చిత్ర నిర్మాణ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. ఇప్పటికే లింక్ షేర్ చేసిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అటు, సంస్థ సైతం ఇంటర్నల్‌గా విచారణ ప్రారంభించింది. పోస్ట్ ప్రొడక్షన్ టైంలో మూవీ లీక్ చేశారనే ప్రచారం సాగుతోంది. వైరల్ అవుతున్న వీడియో ఫుటేజీలో వాటర్ మార్క్ ఆధారంగా దీన్ని నిర్ధారిస్తున్నారు. ఇప్పటికే ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దంటూ మూవీ టీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
సోషల్ మీడియా ద్వారా కంటెంట్ డౌన్ లోడ్ చేయడం, లింక్స్ షేర్ చేయడం, చూడడం వంటివి చేస్తే కాపీ రైట్ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆ లింక్స్ తొలగించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణ కొనసాగుతోంది.
సెన్సార్ రివ్యూ ఎప్పుడు?
నిజానికి ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో బ్రేక్ పడింది. అప్పుడే రిలీజ్ అయ్యి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూవీని రివైజింగ్ కమిటీకి పంపించగా... ఆ రివ్యూ తర్వాతే క్లియరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మార్చిలోనే రివ్యూ జరగాల్సి ఉండగా... అది కంప్లీట్ కాలేదు. దీంతో మళ్లీ రివ్యూ ఎప్పుడు? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
మరోవైపు, కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ నటీనటులు చిత్ర నిర్మాణ సంస్థకు సపోర్ట్ చేస్తున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటన షాకింగ్‌కు గురి చేసిందని... పైరసీ సినిమా చూడొద్దని థియేటర్లలోనే మూవీ చూడాలని చెబుతున్నారు.
