టాలీవుడ్ డైరెక్టర్ల తరహాలో భారీ పాన్ ఇండియా హిట్స్ తీయడంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఫెయిల్ అవుతున్నారు. హిట్స్ కోసం మన సౌత్ డైరెక్టర్లు కావాలి. కానీ, అప్పర్ హ్యాండ్ మాత్రం తమదే కావాలని బాలీవుడ్ స్టార్స్ కోరుకుంటున్నారా? తమ కండిషన్లకు 'నో' చెప్పిన టాలీవుడ్ డైరెక్టర్స్ మీద విషం చిమ్ముతున్నారా? మన టాలీవుడ్ డైరెక్టర్లు అప్రోచ్ అయితే గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారా? లేటెస్ట్ 'స్పిరిట్' ఇష్యూ చూస్తే 'నిజం' అని నమ్మక తప్పదు. టాలీవుడ్ డైరెక్టర్స్ మీద బాలీవుడ్ 'డర్టీ పీఆర్ గేమ్స్' కొత్త కాదు. సందీప్ రెడ్డి వంగాకు ముందు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సైతం ఫేస్ చేశారు.

శివగామిగా ఫస్ట్ ఛాయిస్...శ్రీదేవితో గొడవ చిన్నది కాదు!ఉత్తరాది ప్రేక్షకులనూ 'మగధీర', 'ఈగ' మెప్పించాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ, నార్త్ ఇండియాలో రాజమౌళికి మంచి పేరొచ్చింది. దాంతో 'బాహుబలి'ని పాన్ ఇండియా స్థాయిలో తీయాలని దర్శక ధీరుడు ప్లాన్ చేశారు. అప్పటికి ప్రభాస్ ఎవరో నార్త్ జనాలకు అంతగా తెలియదు. రానా దగ్గుబాటి హిందీ సినిమాలు చేయడంతో ఆయనకు గుర్తింపు ఉంది. అనుష్క సైతం హిందీలో నటించలేదు కనుక శివగామి పాత్రకు శ్రీదేవిని తీసుకోవాలని రాజమౌళి భావించారు. అయితే ఆవిడ చేసిన డిమాండ్స్ విని పక్కన పెట్టేశారు.

రెమ్యూనరేషన్ నుంచి తన స్టాఫ్ ఖర్చులు, హోటల్ రూమ్స్ వరకు శ్రీదేవి అడిగిన కోర్కెలకు భయపడిన రాజమౌళి టీమ్ ఆవిడను వద్దనుకుంది. శ్రీదేవి బదులు రమ్యకృష్ణను తీసుకుంది. 'బాహుబలి', దళపతి విజయ్ 'పులి' చూశాక... శివగామిగా శ్రీదేవి చేస్తే రాజమౌళి సినిమా రిజల్ట్ ఏమయ్యేదో అని ఆడియన్స్ కామెంట్ చేశారు. దాంతో రాజమౌళి లేనిపోనివి కల్పించి చెప్పారని బోనీ కపూర్ మండిపడ్డారు. అప్పట్లో బాలీవుడ్ మీడియాలో శ్రీదేవికి అనుకూలంగా, రాజమౌళికి వ్యతిరేకంగా కథనాలు వండి  వార్చారు. తన మీద నెగిటివ్ న్యూస్ వచ్చినా హుందాగా స్పందించారు జక్కన్న. శ్రీదేవి నో చెప్పడం తమకు ప్లస్ అయ్యిందన్నారు తప్ప ఇంకో కామెంట్ చేయలేదు. టాలీవుడ్ డైరెక్టర్ మీద బాలీవుడ్ 'డర్టీ పీఆర్ గేమ్స్' బాహుబలి టైంలో భారీ ఎత్తున జరిగాయి.

కంగనా కోపానికి క్రిష్ బలి...ఏకంగా డైరెక్టర్ పేరు తీసేశారు!రాజమౌళి తర్వాత బాలీవుడ్ 'డర్టీ పీఆర్ గేమ్స్'కు బలైన టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. ఆయన దర్శకత్వంలో 'మణికర్ణిక' సినిమా మొదలైంది. చాలా వరకు సినిమా క్రిష్ తీశారు. అయితే చివరి క్షణంలో క్రిష్ పనితీరు మీద కంగనా రనౌత్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సినిమాను తన చేతుల్లోకి తీసుకున్నారు. కొంత షూట్ చేసి... దర్శకురాలిగా తన పేరు వేసుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ మీద కాన్సంట్రేట్ చేస్తూ తన సినిమాను క్రిష్ పక్కన పెట్టారని కంగనా రనౌత్ ఆరోపించారు. అయితే... 'మణికర్ణిక'కు తాను కావాల్సిన టైం ఇచ్చానని క్రిష్ వివరించారు. కంగనా రనౌత్ పేరు పైన వేసి తన పేరు కింద వేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తన టైట్ షెడ్యూల్ వల్ల కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తానంటే ఓకే అన్నానని, కానీ దర్శకురాలిగా పేరు వేయడానికి అంగీకరించలేదని ఆయన అన్నారు.

'మణికర్ణిక' ఇష్యూలో క్రిష్ జాగర్లమూడికి నటుడు సోనూ సూద్, రైటర్ అపూర్వ అస్రాణి, నటి మిస్తీ చక్రవర్తి మద్దతు ఇచ్చారు. సినిమాలో 80 శాతానికి పైగా క్రిష్ తీశారని పేర్కొన్నారు. ఆయన తీసిన కొన్ని సన్నివేశాలను కంగనా రనౌత్ రీ షూట్ చేశారని పేర్కొన్నారు. అయినా బాలీవుడ్ మీడియాలో కంగనా రనౌత్ వెర్షన్, ఆమె ఇంటర్వ్యూలకు ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది. క్రిష్ జాగర్లమూడిది తప్పు అన్నట్టు కొందరు ప్రాజెక్ట్ చేశారు. 

దీపిక భర్త కూడా అంతే...'బ్రహ్మ రాక్షస' నుంచి అవుట్!ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న 'స్పిరిట్' నుంచి దీపికా పదుకోన్ వెళ్లిపోయారు. ఆవిడ బదులు తృప్తి డిమ్రీని ఎంపిక చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ మీడియాలో 'స్పిరిట్' జానర్, హీరోయిన్ క్యారెక్టర్ డీటెయిల్స్ లీక్ అయ్యాయి. 'స్పిరిట్' ఒక ఏ రేటెడ్ (అడల్ట్ కంటెంట్ ఉన్న) సినిమా అన్నట్టు నెగిటివ్ న్యూస్ వస్తున్నాయి. దీపికా పదుకోన్ కంటే ముందు ఆవిడ భర్త రణవీర్ సింగ్ కూడా ఇలాగే చేశారు.

పాన్ ఇండియా స్థాయిలో 'హనుమాన్' సక్సెస్ సాధించడంతో ప్రశాంత్ వర్మతో చాలా మంది హీరోలు సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. అయితే అతను రణవీర్ సింగ్ హీరోగా 'బ్రహ్మ రాక్షస' ప్రారంభించారు. ఒక రోజు షూటింగ్ కూడా చేశారు. ఆ సినిమా ఆ ఒక్క రోజుతో ఆగింది. క్రియేటివ్ డిఫరెన్స్ అని పైకి చెప్పినా... ప్రశాంత్ వర్మ మీద హిందీలో నెగిటివ్ న్యూస్ వచ్చాయి. రణవీర్ సింగ్ తప్పు లేదన్నట్టు రాసుకొచ్చారు.

సందీప్ రెడ్డి వంగా ఎటాక్...'డర్టీ పీఆర్ గేమ్స్' ఆగుతాయా?బాలీవుడ్ 'డర్టీ పీఆర్ గేమ్స్'ను రాజమౌళి, క్రిష్ జాగర్లమూడి, ప్రశాంత్ వర్మ లైట్ తీసుకున్నారు. సైలెంట్‌గా ఉన్నారు. అయితే సందీప్ రెడ్డి వంగా రూట్ సపరేట్ కదా! తప్పును అసలు సహించరు. తన కథ, క్యారెక్టర్స్ గురించి దీపికా పదుకోన్ లీక్స్ ఇవ్వడంతో ఏకంగా కథంతా లీక్ చేసుకోమని ట్వీట్ చేశారు. స్ట్రెయిట్ ఎటాక్ చేశారు. దాంతో బాలీవుడ్ డిఫెన్స్‌లో పడింది. పిల్లి మెడలో గంట కట్టినట్టు పిల్ల చేష్టలు వద్దంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దాంతో ఈ 'డర్టీ పీఆర్ గేమ్స్'కు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి

సౌత్ దర్శకులను చిన్న చూపు చూడటం ఒక్కటే కాదు... డర్టీ పీఆర్ గేమ్స్ ఆడుతూ మిగతా వాళ్ళ కెరీర్స్‌తో కొందరు బాలీవుడ్ స్టార్స్ గేమ్స్ ఆడటం కేవలం తమ తమ కెరీర్స్ కాపాడుకోవడం కోసమే అని చెప్పవచ్చు. 'పద్మావత్' సమయంలో తన మీద తనకు సందేహం కలిగేలా చేశారంటూ ఆ మధ్య షాహిద్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ దంపతుల పీఆర్ గేమ్ మీద పరోక్షంగా విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ ఆటకు సౌత్ డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ, సందీప్ రెడ్డి వంగా బలి అయ్యారు.

Also Readథియేటర్స్ బంద్ కుట్ర వెనుక ద్వారంపూడి... వైసీపీ ఆటలో 'ఆ నలుగురు' పావులు అయ్యారా?

టాలీవుడ్ డైరెక్టర్స్ ఆధిపత్యం, దూకుడు మీద బాలీవుడ్ సీనియర్లలో ఆందోళన మొదలైందని చెప్పడానికి ఆ మధ్య సీనియర్ రైటర్, లిరిసిస్ట్ జావేద్ అక్తర్ చెప్పిన మాటల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఉత్తరాది ప్రేక్షకులకు తెలియని హీరోలు నటించిన సినిమాలు (బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్) సినిమాలు ఐదారు వందలకు పైగా కలెక్షన్స్ సాధించాయని, హిందీలో ఆ స్థాయి కలెక్షన్స్ సాధించిన సినిమాల వెనుక సౌత్ డైరెక్టర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పింది నిజమే... షారుఖ్ ఖాన్ 'జవాన్', షాహిద్ కపూర్ 'కబీర్ సింగ్', రణబీర్ కపూర్ 'యానిమల్' తీసింది సౌత్ డైరెక్టర్లే. దాంతో సౌత్ డైరెక్టర్లకు తెలిసినంతగా బాలీవుడ్ డైరెక్టర్లకు ఆడియన్స్ పల్స్ తెలియడం లేదా? అనే ప్రశ్న వస్తోంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ భారీ హిట్స్ తీస్తే... 'బాహుబలి'ని బీట్ చేయగల సినిమాలు చేస్తే తప్ప... ఇప్పట్లో మన దర్శకుల జోరును అడ్డుకోవడం కష్టమే.

Also Read: 'ఆ నలుగురు' ఎవరు? అగ్ర నిర్మాతలేనా? ఇండస్ట్రీని తమ గుప్పిట్లో పెట్టుకున్నారా?? వాళ్ళ చేతుల్లో ఏముంది??