Tanushree Dutta Emotional Video For Seeking Help: ఒకప్పుడు వరుస సినిమాలతో ఓ వెలుగు వెలిగిన బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా తాజాగా కన్నీళ్లు పెట్టుకుంటూ షేర్ చేసిన వీడియో ఆందోళన కలిగిస్తోంది. తన ఇంట్లోనే తనను వేధిస్తున్నారని... ఈ వేధింపులతో విసిగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర బాధతో ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హెల్ప్ చేయండి
తనకు ఎవరైనా సాయం చేయాలంటూ తనుశ్రీ వేడుకుంటున్నారు. 'నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. పోలీసులకు ఫోన్ చేస్తే స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాను. గత నాలుగైదేళ్ల నుంచి ఈ బాధ తట్టుకోలేకపోతున్నా. నా ఇల్లంతా చిందరవందరగా మారిపోయింది. నమ్మకంగా ఉంటారని పనివాళ్లను పెట్టుకుంటే వాళ్లొచ్చి నా వస్తువుల్ని చోరీ చేస్తున్నారు. నా ఇంట్లోనే నాకు సేఫ్టీ లేకుండా పోయింది. ఎవరైనా వచ్చి నాకు కాస్త హెల్ప్ చేయండి.' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Also Read: సనాతన ధర్మం అవసరం, ఎవరినీ వీరమల్లు కించపరచదు - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్
ఒకప్పుడు టాప్ హీరోయిన్
ఇండస్ట్రీలో ఒకప్పుడు తనుశ్రీ దత్తా టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తనదైన నటనతో ఓ ముద్ర వేశారు. బిహార్‌కు చెందిన ఈమె 2004 ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచారు. 'ఆషిక్ బనాయా ఆప్నే' పాటతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తెలుగులో 2005లో 'వీరభద్ర' మూవీలో నటించారు. ఆ తర్వాత 2010లో తమిళంలో 'తీరదు విలాయాట్టు పిళ్లై' అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత 2013 వరకూ బాలీవుడ్‌లోనే పలు మూవీస్ చేశారు. ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరమయ్యారు.
మీటూ ఉద్యమంలో...
2018లో 'మీటూ' (#Metoo) ఉద్యమంలో భాగంగా ప్రముఖ యాక్టర్ నానా పటేకర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తనను లైంగికంగా వేధించారని తెలిపారు. ఈ కేసులో పటేకర్‌కు క్లీన్ చిట్ వచ్చింది. అటు, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సైతం తనను ఓ మూవీ కోసం నగ్నంగా డ్యాన్స్ చేయాలని అడిగారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం తనకు ఇంట్లోనే వేధింపులు ఎక్కువయ్యాయంటూ కన్నీళ్లు పెట్టుకుని వీడియో రిలీజ్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.