Latest Buzz On Puri Jagannadh Vijay Sethupathi Movie Updates: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో ఓ మూవీ రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవలే మూవీ టీం ప్రకటించింది. తాజాగా.. ఈ సినిమాపై మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

మరో బాలీవుడ్ హీరోయిన్?

ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టేను (Radhika Apte) సైతం తీసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఓ ముఖ్య పాత్రలో ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. రాధికా ఆప్టే రోల్ చాలా డిఫరెంట్‌గా ఉండనుందని సమాచారం. ఈ మూవీలో పాత్రలన్నీ చాలా వేరియేషన్స్‌తో సాగుతాయని సినీ వర్గాల టాక్. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ 'పూరీ కనెక్ట్స్' అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన ఫస్ట్ సీ అడ్వెంచర్ మూవీ 'కింగ్ స్టన్' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

స్టోరీపైనే అందరి ఆసక్తి..

పూరీ జగన్నాథ్ మూవీ అంటేనే మాస్ ఆడియన్స్‌కు ఓ స్పెషల్ క్రేజ్. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఆయన ఖాతాలో సరైన హిట్ పడకపోవడంతో ఈసారైనా భారీ హిట్ కొట్టాలని అంతా భావిస్తున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో పూరీ మూవీ ప్రకటన రాగానే భారీ హైప్ నెలకొంది. ఎన్నడూ లేని విధంగా ఓ డిఫరెంట్ జానర్‌లో మూవీ రాబోతోందని తెలుస్తోంది. నిజానికి 'ఉప్పెన' తర్వాత విజయ్ సేతుపతి ఏ సినిమా చేయలేదు.

టాలీవుడ్ డైరెక్టర్స్ చాలా మంది విభిన్న కథలతో విజయ్ సేతుపతి వద్దకు వెళ్లినా.. ఆయన ఓకే చేయనట్లు తెలుస్తోంది. అయితే, పూరీ చెప్పిన కథకు మాత్రం విజయ్ సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పేశారనే టాక్ వినిపిస్తోంది. మరి పూరీ ఎలాంటి స్టోరీ చెప్పారా? అనేదే అందరిలోనూ ఆసక్తిగా మారింది. ఇటీవలే 'మహారాజ' బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విజయ్ సేతుపతి. ఆ తర్వాత వచ్చిన 'విడుదల పార్ట్ 2' సినిమాలోనూ తనదైన నటనతో మెప్పించారు.

త్వరలోనే నటీనటుల వివరాలు

ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్ర చేయనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నటీనటులు, ఇతర వివరాలను ప్రకటిస్తామని మూవీ టీం పేర్కొంది.

పూరీ కమ్ బ్యాక్ కావాల్సిందే!

ఈ సినిమాతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మంచి హిట్ సాధించి కమ్ బ్యాక్ కావాలని ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఆకాంక్షిస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలతో బాక్సాఫీస్ బిగ్గెస్ట్ హిట్స్ అందించారు పూరీ. మహేష్ బాబు పోకిరి, బిజినెస్ మ్యాన్ నుంచి ఎన్టీఆర్ 'టెంపర్' వరకూ మంచి కలెక్షన్లు సాధించాయి. ఆ తర్వాత ఆయన ట్రెండ్ కాస్త తగ్గింది. 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' హిట్‌తో పూరీ కమ్ బ్యాక్ అయ్యారని అంతా అనుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'లైగర్' అనుకున్నంత అంచనాలు అందుకోలేకపోయింది. ఇప్పుడు విజయ్ సేతుపతితో కొత్త సినిమా ప్రకటన రాగా..  పూరీ జగన్నాథ్ ట్రెండ్ మళ్లీ సెట్ చేయాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.