ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు, యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 'స్వాతిముత్యం' అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు గణేష్. గతేడాది దసరా సందర్భంగా రిలీజైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోలేకపోయినా, ఇన్నోసెంట్ యాక్టింగ్ తో బెల్లంకొండ బ్రదర్ అందరి దృష్టిలో పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'నేను స్టూడెంట్ సర్!' అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.
సాయి గణేష్, అవంతిక దాసాని జంటగా నటించిన తాజా చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అప్పుడెప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ, ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఆదివారం సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ట్రైలర్ లోకి వెళ్తే, సుబ్బారావు అనే ఓ సాధారణ మిడిల్ క్లాస్ యువకుడు.. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ డబ్బు కూడబెట్టుకొని ఒక ఐఫోన్ ను కొనుక్కుంటాడు. తన తల్లి చెప్పడంతో ఆ ఫోన్ ను సొంత తమ్ముడిగా భావించి బుచ్చిబాబు అని పేరు కూడా పెడతాడు. కాస్ట్లీ ఫోన్ కొన్న సంతోషంతో సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సంబరపడిపోతుంటాడు. అలానే తన ప్రేయసితో కలిసి పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఆ ఫోన్ లో అనుకోకుండా ఒక హత్యకు సంబంధించిన వీడియో రికార్డ్ అవడంతో అతని జీవితం తలక్రిందులైనట్లు తెలుస్తోంది.
ఆ మర్డర్ తో తనకు సంబంధం లేదని సుబ్బారావు చెప్తున్నా.. సిటీ పోలీస్ కమిషనర్ అర్జున్ వాసుదేవన్ మాత్రం అతడినే దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి తోడు అతని బ్యాంక్ అకౌంట్ లోకి 1.75 కోట్ల డబ్బు జమ కావడంతో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. అయితే సుబ్బూకి సపోర్ట్ గా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ రంగంలోకి దిగి, కమిషనర్ కు ఎదురుతున్నారు. తొమ్మిది నెలలు కష్టపడితే కానీ ఒక ఫోన్ కొనుక్కోలేని హీరో అకౌంట్ లోకి అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా వచ్చింది? అతన్ని కమీషనర్ ఎందుకు ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నాడు? అసలు ఆ హత్య చేసింది ఎవరు? అనేది సినిమా కథ అని అర్థమవుతోంది.
కృష్ణ చైతన్య అందించిన కథకు ఆసక్తికరమైన కథనాన్ని జోడించి దర్శకుడు రాఖీ ఉప్పలపాటి ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. ఇక 'స్వాతిముత్యం' తరహాలోనే ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ గా బెల్లంకొండ గణేష్ ఆకట్టుకున్నాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సముద్రఖని సీరియస్ నటనతో తన ఉనికిని చాటుకున్నాడు. హీరోయిన్ అవంతిక దాసాని అందంగా కనిపించినప్పటికీ, ట్రైలర్ లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, ప్రమోదిని తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రాఫర్ అనిత్ మదాడి కెమెరా పనితనం అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేసిన ఈ సినిమాకి కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందించారు. SV2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత 'నాంది' మాదిరిగానే ఈసారి కూడా ఒక యూనిక్ సబ్జెక్ట్ తో కంటెంట్ రిచ్ మూవీని రూపొందించారని తెలుస్తోంది. మొత్తం మీద ‘నేను స్టూడెంట్ సర్!’ ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి జూన్ 2న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
Read Also: నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ హిట్లు, ఎన్నో ఆటు పోట్లు - ఎన్టీఆర్ సినీ జర్నీ సాగిందిలా!