ఆయేషా ఖాన్ (Ayesha Khan Bigg Boss 17)... ఇప్పుడీ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే... తెలుగు ఆమె నటించిన సినిమా ఒక్కటంటే ఒక్కటే విడుదలైంది. అయితే... త్వరలో ఆమె పేరు బలంగా వినిపిస్తోందని చెప్పడంలో అసలు సందేహం అవసరం లేదు. ఈ బాలీవుడ్ భామకు టాలీవుడ్ లక్కీగా మారింది. వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. లేటెస్టుగా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ వివరాల్లోకి వెళితే... 


దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' సినిమాలో!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా చిత్రసీమలో కథానాయకుడిగా వచ్చిన దుల్కర్ సల్మాన్... భాషలకు అతీతంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. 'మహానటి'తో ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తమిళ అనువాద సినిమా 'కనులు కనులు దోచాయంటే'తో మరో విజయం అందుకున్నారు. ఇప్పుడు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'లక్కీ భాస్కర్' సినిమా చేస్తున్నారు. 


'లక్కీ భాస్కర్' సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. అయితే... ఆమె కాకుండా మరో కథానాయికకు అవకాశం ఉందట. నిడివి తక్కువ అయినప్పటికీ... కథలో కీలకమైన ఆ పాత్రకు ఆయేషా ఖాన్ (Ayesha Khan in Lucky Bhaskar)ను ఎంపిక చేశారు. ఈ సినిమాలో భాగం కావడం తనకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉందని పేర్కొన్నారు. 'లక్కీ భాస్కర్'లో నటిస్తున్న విషయాన్ని సోమవారం ఆయేషా ఖాన్ తెలిపారు.


Also Readఅందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు


'ముఖచిత్రం'తో ఆయేషా ఖాన్ తెలుగు చిత్రసీమకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'ఓం భీమ్ బుష్' సినిమా చేశారు. అందులో ఆమె ఓ కథానాయిక. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. అది కాకుండా విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో ప్రత్యేక గీతం చేశారు.


Also Readథియేటర్లలో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న తెలుగు సినిమాలు ఇవే!


శ్రీకర స్టూడియోస్ సమర్పణలో 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'సార్' విజయం తర్వాత వెంకీ అట్లూరి, నిర్మాతల కలయికలో రూపొందుతున్న చిత్రమిది. సితార సంస్థ ప్రొడ్యూస్ చేసే మరికొన్ని సినిమాల్లో ఆయేషా ఖాన్ అవకాశాలు అందుకున్నారని టాక్.


'లక్కీ భాస్కర్' సినిమా విషయానికి వస్తే... బొంబాయి(ముంబై) నేపథ్యంలో రెట్రో లుక్కులో రూపొందుతోంది. కథ 80ల కాలంలో సాగుతుందని తెలిసింది. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మరో జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.