Ayalaan Box Office Collections: తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘అయాలన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’కు పోటీగా ఈ మూవీ విడుదలయ్యింది. ‘కెప్టెన్ మిల్లర్’ ముందు ‘అయాలన్’ నిలబడడం కష్టమని చాలామంది అనుకున్నా.. దానికి భిన్నంగా ‘అయాలన్’ కలెక్షన్సే రోజురోజుకీ ఇంప్రూవ్ అవుతున్నాయి. విడుదలయిన ఫస్ట్ వీకెండ్ పూర్తవ్వగానే ఈ మూవీ హాఫ్ సెంచరీ కొట్టినట్టు మేకర్స్.. స్పెషల్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. దీంతో సంక్రాంతి సెలవులు ‘అయాలన్’కు బాగా వర్కవుట్ అయ్యిందని శివకార్తికేయన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.


హాఫ్ సెంచరీ


ప్రపంచవ్యాప్తంగా ‘అయాలన్’కు రూ.50 కోట్లు బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చాయని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికీ ఈ మూవీ తమిళ వర్షన్ మాత్రమే రిలీజ్ అయ్యింది. అసలైతే దీని తెలుగు డబ్బింగ్ వర్షన్‌కు థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది. కానీ అప్పటికే సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. అందుకే డబ్బింగ్ చిత్రానికి థియేటర్లు దొరకడం కష్టమని.. ఒకవేళ దొరికినా కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వచ్చే అవకాశాలు ఉంటాయని మేకర్స్ వెనక్కి తగ్గారు. ఇక ఇప్పటికీ ‘అయాలన్’ తెలుగు వర్షన్ విడుదలపై ఎలాంటి క్లారిటీ లేదు. త్వరగా విడుదలయితే బాగుంటుందని శివకార్తికేయన్ తెలుగు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


పోస్ట్ ప్రొడక్షన్‌లో ఆలస్యం


‘అయాలన్’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు రవికుమార్. దర్శకుడు కొత్తవాడే అయినా.. తన విజన్‌పై నమ్మకంతో రెమ్యునరేషన్‌ను తగ్గించుకొని మరీ ఈ సినిమాలో యాక్ట్ చేశాడు శివకార్తికేయన్. రెండేళ్ల క్రితం ఈ మూవీ షూటింగ్ మొదలయ్యింది. షూటింగ్ పార్ట్ వరకు త్వరగానే పూర్తయినా కూడా విజువల్స్, గ్రాఫిక్స్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే పోస్ట్ ప్రొడక్షన్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది టీమ్. వారు నమ్మినట్టుగానే ‘అయాలన్’ విజువల్స్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. ఏలియన్, మనిషికి మధ్య ఫ్రెండ్‌షిప్ అనే కథ కూడా ప్రేక్షకులకు డిఫరెంట్‌గా అనిపించింది. ఇలాంటి ఒక డిఫరెంట్ కథలో సరిపడా కామెడీని కూడా జోడించి మూవీని ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించాడు దర్శకుడు రవికుమార్. అందుకే ‘అయాలన్’ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంతో పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.


సక్సెస్‌పై నమ్మకం


‘అయాలన్’లో శివకార్తికేయన్‌కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. వీరితో పాటు యోగిబాబు, షరద్ కెల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియా లాంటి నటీనటులు కూడా కీలక పాత్రలు పోషించారు. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై కోటపాడి జే రాజేష్.. ఈ సినిమాను నిర్మించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌ను అందించారు. ‘అయాలన్’ విడుదలవ్వక ముందే ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు శివకార్తికేయన్. ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొన్నాడు. తనతో పాటు నిర్మాత కోటపాడి కూడా ‘అయాలన్’ కచ్చితంగా హిట్ అవుతుందని చాలా సందర్భాల్లో ధీమా వ్యక్తం చేశారు. ‘బాహుబలి’ అనే సినిమా టాలీవుడ్‌ను ఎలా మార్చిందో.. ‘అయాలన్’ అనే సినిమా కోలీవుడ్‌ను కూడా అలాగే మారుస్తుందని నిర్మాత ఇచ్చిన స్టేట్‌మెంట్ అప్పట్లో వైరల్ కూడా అయ్యింది. 


Also Read: ముందే ఫిక్స్ అయ్యా, చివరి సినిమా ఇదే కావచ్చు - మహేశ్ బాబు