AVS Son Pradeep About Jyothi: గత కొన్నేళ్లలో చాలామంది సీనియర్ కమెడియన్లను తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయింది. అందులో ఏవీఎస్ కూడా ఒకరు. అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం అయినా యాక్టర్‌గా అడుగుపెట్టిన తర్వాత ఏవీఎస్ అనే పేరుతోనే ఫేమస్ అయ్యారు. ఇప్పటికీ ఎన్నో తెలుగు సినిమాల్లో ఆయన పాత్రలను, అందులో యాసను ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారంటే ఆయన సంపాదించుకున్న క్రేజ్ అలాంటిది. ఇక ఏవీఎస్ హఠాన్మరణం ఇండస్ట్రీకి ఎంత లోటుగా మిగిలిందో తన కుటుంబానికి కూడా అంతే లోటును మిగిల్చింది. తాజాగా ఏవీఎస్ కుమారుడు ప్రదీప్.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన తండ్రిపై జ్యోతి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.


వాళ్లంతా లెజెండ్స్..


ఎక్కువగా ఏవీఎస్.. సినిమాలు, అందులో తన పాత్రలపై మాత్రమే శ్రద్ధపెట్టేవారు. ఆఫ్ స్క్రీన్ కాంట్రవర్సీలకు ఆయన చాలా దూరం. అయినా కూడా నటి జ్యోతి ఒక సందర్బంలో ఆయనపై పలు వ్యాఖ్యలు చేశారు. తనకు నటనే రాదని ఏవీఎస్ అన్నారని ఆరోపణలు చేసింది. ఆ విషయంలో ఇప్పుడు తన కుమారుడు ప్రదీప్ స్పందించారు. ‘‘ఆవిడలో మా నాన్నకు ఆర్టిస్ట్ కనిపించలేదు. ఆవిడకు మా నాన్న జోక్‌లో పంచ్‌లో కనిపించలేదు. అది ఆవిడ సమస్య. అప్పటి కమెడియన్స్ అందరూ లెజెండ్స్. ఎవరో చెప్తే వారు వచ్చి కెమెరా ముందు నిలబడి నటించలేదు. స్వయంకృషి అనేది కరెక్ట్ పదం. అలాంటి వాళ్లు ఇప్పుడు లేరు’’ అంటూ తన తండ్రితో పాటు ఇతర కమెడియన్ల గురించి కూడా గుర్తుచేసుకున్నారు ప్రదీప్.


చనిపోయిన తర్వాత అలా చేయకూడదు..


‘‘మనిషి చనిపోయిన తర్వాత వారి గురించి నెగిటివ్‌గా మాట్లాడేవారిని నేను కనీసం పట్టించుకోను. లేని మనిషి గురించి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం దయ చూపిస్తే బాగుంటుంది. మనిషి లేనప్పుడు ఆయన గురించి మాట్లాడే పద్ధతి వల్లే నీ క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది. కెమెరా ముందు కూర్చొని మాట్లాడడానికి అర్హత లేదు నీకు. ఎవరైనా సరే అలా చేయకూడదు. ఇప్పుడు చెడు మాట్లాడమని ఎవరు చెప్తున్నారు? మరి ఆయన ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు. ఎందుకంటే అప్పుడైతే అక్కడ నుండి కరెక్ట్ సమాధానం వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ సమాధానం ఇవ్వడానికి ఆయన లేరు కాబట్టి మాట్లాడుతున్నారు’’ అంటూ చనిపోయిన వారి గురించి ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని ప్రదీప్ వాపోయారు.


ఆ సినిమా వల్లే..


ఉదయ్ కిరణ్ హీరోగా, వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఏవీఎస్ ఒక చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. అదే ‘ఓరి.. నీ ప్రేమ బంగారంగానూ’ అనే మూవీని చేయాల్సి ఉంది. కానీ అదే సమయంలో ఇద్దరికీ వేరే పెద్ద ప్రాజెక్ట్స్ రావడంతో వాటిని వదులుకోలేక ఈ సినిమా నుండి తప్పుకున్నారు. దీంతో మంచి కథను వదులుకోకూడదు అనే ఉద్దేశ్యంతో ‘ఓరి.. నీ ప్రేమ బంగారంగానూ’ సినిమాను చేశారని, దాని వల్ల ఏవీఎస్ జీరో అయిపోయారని ప్రదీప్ గుర్తుచేసుకున్నారు. తన తండ్రి చాలాసార్లు మధ్యాహ్నం భోజనం చేయకుండా పాన్ వేసుకునేవారని తెలిపారు. ఎప్పుడూ తన కుటుంబాన్ని రిస్క్‌లో పెట్టే పనులు ఏవీఎస్ చేయలేదన్నారు. 



Also Read: పెళ్లిలో అందరినీ చంపేసి బిర్యానీ తిన్నాడు - గోపీచంద్, శ్రీనువైట్ల మూవీ టైటిల్ ఇదే, ఫస్ట్ స్ట్రైక్ వీడియో చూశారా?