Hi Nanna: డిసెంబర్ మొదటి వారం నుంచే సినిమా సందడి మొదలయ్యింది. ప్రస్తుతం థియేటర్లలో ‘యానిమల్’ ఫీవర్ నడుస్తుండగా.. దానికి పోటీ ఇవ్వడం కోసం ‘హాయ నాన్న’ వచ్చేస్తోంది. రెండు సినిమాలకు అసలు పోలిక లేకపోయినా.. ఈ రెండిటికి ప్రేక్షకుల్లో తగిన హైప్‌ను క్రియేట్ చేశాయి మూవీ టీమ్స్. ఇక ‘హాయ్ నాన్న’ విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌లో మరింత స్పీడ్ పెంచాడు దర్శకుడు శౌర్యువ్. ఇది తనకు మొదటి సినిమానే అయినా నాని సపోర్ట్‌తో ప్రమోషన్స్ విషయంలో ముందుకు వెళ్తున్నాడు. ఇక తాజాగా శౌర్యువ్ పాల్గొన్న ఇంటర్వ్యూలో ‘హాయ్ నాన్న’ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ సినిమాతో పోలుస్తూ ప్రశ్నించగా.. దానికి తను క్లారిటీ ఇచ్చాడు.


రీమేక్ కాదు.. పోలిక లేదు..
‘హాయ్ నాన్న’ ఒక సింగిల్ ఫాదర్ లవ్ స్టోరీ అని మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వడంతో పాటు ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, ట్రైలర్లు చూసినా కూడా అర్థమవుతోంది. అయితే ఇలాంటి సింగిల్ ఫాదర్ కథలు అన్నింటితో ‘హాయ్ నాన్న’ను పోలుస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే తమిళ చిత్రం ‘డాడా’ రీమేక్‌లాగా ఉందని పలు ఇంటర్వ్యూల్లో మూవీ టీమ్‌కు ప్రశ్నలు ఎదురయినా.. ఇది రీమేక్ కాదని టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇంతలోనే తాజాగా మరో ఇంటర్వ్యూలో ఒక క్లాసిక్ బాలీవుడ్ చిత్రంతో ‘హాయ్ నాన్న’ను పోల్చగా దర్శకుడు శౌర్యువ్ మరోసారి అందరికీ క్లారిటీ ఇచ్చాడు.


నాని సలహాలు..
‘హాయ్ నాన్న’ను చూస్తుంటే షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ క్లాసిక్ మూవీ ‘కుచ్ కుచ్ హోతా హై’ గుర్తొస్తుందని సోషల్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. అంతే కాకుండా నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సంతోషం’ కూడా తండ్రీ, కొడుకుల కథే అని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ఇక తాజాగా ఈ అన్ని కథనాలపై శౌర్యువ్ స్పందించాడు. ‘‘ఒక సింగిల్ తండ్రి మళ్లీ ప్రేమలో పడతాడు కాబట్టి ఈ సినిమాతో పోలికలు ఉండడం సహజం. కానీ ఇది పూర్తిగా నేను నా చుట్టూ ఉన్న విషయాలను గమనిస్తూ రాసుకున్న కథ’’ అని శౌర్యువ్ తెలిపాడు. అయితే సింగిల్ తండ్రి కథే ఎందుకు అని దర్శకుడిని అడగగా.. ‘‘చాలావరకు కుటుంబాల్లో అమ్మే పిల్లలకు ఎక్కువ ప్రేమను పంచుతుంది. కానీ ఒకవేళ తండ్రిపైనే ఆ మొత్తం బాధ్యత ఉంటే పిల్లలతో తన అనుబంధం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాను. తన కూతురు ఎక్కడ ఉన్నా తాను కూడా అక్కడే ఉండాలి అనుకునే తండ్రి పాత్రలో నాని కనిపించబోతున్నారు. ఆయన జీవితం మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది. నాని కూడా తండ్రే కాబట్టి ఆయన దగ్గర కూడా పాత్ర కోసం సలహాలు తీసుకున్నాను’’ అని బయటపెట్టాడు.


సస్పెన్స్‌లో శృతి హాసన్ పాత్ర..
మృణాల్, శృతి హాసన్ పాత్రల గురించి చెప్పమని శౌర్యువ్‌ను అడగగా.. ‘‘కథ రాసుకుంటున్నప్పుడే మృణాల్ నా మైండ్‌లో ఉంది. తను ఎస్ చెప్పడం నా అదృష్టం. తన పాత్రకు చాలా కోణాలు ఉంటాయి. అవన్నీ తను కరెక్ట్‌గా చేసింది. తను ఏడుస్తున్నప్పుడు చాలా అందంగా కూడా ఉంటుంది’’ అని తెలిపాడు. కానీ శృతి హాసన్ గురించి మాత్రం ఎక్కువగా రివీల్ చేయడానికి ఇష్టపడలేదు. తను కథకు చాలా ముఖ్యమని మాత్రమే చెప్పి ఆపేశాడు. దీంతో ‘హాయ్ నాన్న’లో శృతి కథ ఏంటి అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.


Also Read: ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ‘యానిమల్’ డిలీటెడ్ సీన్ - ఎందుకు డిలీట్ చేశారంటూ వాపోతున్న ఫ్యాన్స్!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply