విజయవంతమైన కమర్షియల్ సినిమాలు తీసిన దర్శకుడిగా అట్లీ కుమార్ (Atlee Kumar)కు పేరు ఉంది. కోలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలతో ఆయన చేసిన సినిమాలు అలవోకగా వంద కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ చేరుకునేవి. ఇక, కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా 'జవాన్' తీసి హిందీలోనూ భారీ విజయం అందుకున్నారు. ఇప్పుడు ఆయన భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారని ముంబై ఖబర్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'నో' చెప్పిన తర్వాత ఆయన ప్లాన్ పూర్తిగా మార్చేశారట.
రజనీకాంత్ - సల్మాన్ ఖాన్ హీరోలుగా...
'జవాన్' విడుదలకు ముందు మాట... దర్శకుడు అట్లీ హైదరాబాద్ వచ్చారు. అల్లు అర్జున్ (Allu Arjun)ను కలిశారు. ఇద్దరూ కలిసి ఒక సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. కథపై కొంత చర్చలు జరిగాయి. ఇదంతా గతం!
'జవాన్' విడుదల తర్వాత అట్లీ కుమార్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ పనులు మొదలు పెట్టారు. కథలో ఒక్క హీరో కాకుండా మరొక హీరోకి స్కోప్ వచ్చింది. ఇద్దరు హీరోలతో సినిమా చేద్దామని ప్రపోజ్ చేయగా... అల్లు అర్జున్ రిజెక్ట్ చేసినట్టు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ చెప్పాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఇప్పుడు ఆ కథను హిందీ హీరో - తమిళ్ హీరో దగ్గుకు తీసుకు వెళ్లారట.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోలుగా అట్లీ కుమార్ సినిమా చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఇద్దరు సూపర్ స్టార్లకు కథ గురించి చెప్పారని, ఆ ఇద్దరూ సూచనప్రాయంగా అంగీకరించారని సమాచారం.
సన్ పిక్చర్స్ నిర్మాణంలో సూపర్ మల్టీస్టారర్!
అట్లీ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్, సల్మాన్ ఖాన్ హీరోలుగా నటించనున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాను సన్ పిక్చర్స్ పతాకం మీద కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆయనతో రజనికీ మంచి అనుబంధం ఉంది. ఆ కారణం చేత ఈ సినిమాలో నటించేందుకు కోలీవుడ్ సూపర్ స్టార్ ఓకే చేశారట.
ప్రజెంట్ రజనీకాంత్ 'వేట్టయాన్' సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత 'కూలీ' చేస్తారు. సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే... ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'సికిందర్' చేస్తున్నారు. ఇద్దరూ తమ తమ సినిమాలు పూర్తి చేసుకున్నాక అట్లీ సినిమా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్ గనుక ఓకే అని ఉంటే... సల్మాన్ లేదా రజని ఎవరో ఒకరితో సినిమా చేసే వారని, ఇప్పుడు మంచి ఛాన్స్ మిస్ అయ్యారని కామెంట్లు వినబడుతున్నాయి.
Also Read: ఏపీలో 'కల్కి 2898 ఏడీ' టికెట్ రేట్స్ పెరిగాయ్ - తెలంగాణలో కంటే ఎక్కువ రోజులు, ఎక్కువ రేట్లు
అల్లు అర్జున్ విషయానికి వస్తే... సుకుమార్ దర్శకత్వంలో తనకు నేషనల్ అవార్డు తెచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమాకు సీక్వెల్ 'పుష్ప: ది రూల్' చేస్తున్నారు. అది పూర్తి అయ్యాక అట్లీ సినిమా ఉంటుందని అనుకుంటే అది క్యాన్సిల్ అయ్యింది. దాంతో ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయట.