డివోషనల్ టచ్ ఉన్న సినిమాలకు ప్రేక్షకాదరణ బావుంటోంది. అందులోనూ శివుని నేపథ్యం తెలుగు చిత్రసీమకు కలిసి వచ్చింది. 'అఖండ' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ', విష్ణు మంచు 'కన్నప్ప' సైతం డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు. ఈ జాబితాలో చేరే చిత్రమే 'శివం భజే'


అశ్విన్ బాబు హీరోగా 'శివం భజే'
యువ కథానాయకుడు అశ్విన్ బాబు (Ashwin Babu) హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా 'శివం భజే' (Shivam Bhaje Movie). గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. అప్సర్ దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ ఏజ్ కథతో సస్పెన్స్, యాక్షన్, థ్రిల్ అంశాలు మేళవించి తెరకెక్కిస్తున్న డివోషనల్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. ఇవాళ విడుదలైన టీజర్ చూస్తే అలాగే ఉంది.


Shivam Bhaje Movie Teaser Review: 'శివం భజే' టీజర్ చూస్తే... 'ఉన్నట్టుండి తలపోటు వస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు' అని డాక్టర్ (బ్రహ్మాజీ)కి హీరో (అశ్విన్ బాబు) తన సమస్యను చెప్పే డైలాగుతో మొదలైంది. అతడికి తోడుగా 'హైపర్' ఆది ఉన్నాడు. ఆ తర్వాత ఓ దేవాలయంలో అఘోరాను చూపించారు. 


'అలజడి దాటి ఆలోచనకు పదును పెడితే అంతా అర్థం అవుతుంది' అని మరో డైలాగ్. అయ్యప్ప శర్మ వాయిస్ వల్ల అందులో డెప్త్ మరింత పెరిగింది. 'ఈ యుద్ధం నీది కాదు... స్వయానా ఆ నీలకంఠుడు లిఖించిన శత్రు వినాశనం' అని మరో డైలాగ్. దాంతో డివోషనల్ టచ్ ఉన్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. అశ్విన్ బాబు యాక్షన్ సీన్లు బాగా చేశారు. రౌద్ర రూపంలో రౌడీలను కొట్టడం, శూలంతో ఎత్తి పడేయడం గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. అన్నిటికీ మించి చివర్లో శివుని సీజీ రూపం సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.


Also Read: డార్లింగ్ అనేది ఇందుకే... 'కల్కి' ప్రీ రిలీజ్‌లో క్యూట్ మూమెంట్ - ప్రెగ్నెంట్ దీపికకు ప్రభాస్ హెల్ప్!



'నీకు తెలియకుండా నువ్ ఊహించని ప్రళయాన్ని ఢీ కొట్టబోతున్నావ్' అని అశ్విన్ బాబుతో అయ్యప్ప శర్మ చెప్పారు. ఆ ప్రళయం ఏమిటనేది థియేటర్లలో చూడాలి. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ''వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. టీజర్ అద్భుతమైన స్పందన అందుకోవడం సంతోషంగా ఉంది. అశ్విన్ బాబుతో పాటు మిగతా చిత్ర బృందం సహకారంతో సినిమా చేస్తున్నాం. జూలైలో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం'' అని చెప్పారు.


Also Readకల్కి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... మూవీ సెన్సార్ పూర్తి... ప్రభాస్ సినిమాకు ముంబై నుంచి షాకింగ్ రిపోర్ట్స్!


అశ్విన్ బాబు కథానాయకుడిగా, అర్బాజ్ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో దిగంగనా సూర్యవంశీ కథానాయిక. ఇతర కీలక పాత్రల్లో 'హైపర్' ఆది, మురళీ శర్మ, సాయి ధీనా, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, 'షకలక' శంకర్, కాశీ విశ్వనాథ్, ఇనాయా సుల్తాన నటిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, సంగీతం: వికాస్ బడిస, పోరాటాలు: పృథ్వీ - రామకృష్ణ, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలి, దర్శకత్వం: అప్సర్.