ప్రపంచ సినిమా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డుల కార్యక్రమం ఇటీవలే జరిగింది. మార్చి 13 న అమెరికాలో జరిగిన ఈ అవార్డుల వేడుకలో ఇండియా నుంచి రెండు సినిమాలు ఆస్కార్ ను అందుకున్నాయి. అందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వరించగా.. బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ గా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ షార్ట్ ఫిల్మ్ కు అవార్డు లభించింది. అయితే తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ జ్యూరీపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అర్హత లేని సినిమాలను ఆస్కార్ కు పంపుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రెహమాన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


ఆ ఇంటర్వ్యూలో సంగీతంలో వస్తోన్న ట్రెండ్స్ పై మరో సంగీత దర్శకుడు ఎల్ సుబ్రహ్మణ్యంతో కలసి చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత ఫిల్మ్ ఫెడరేషన్ పై విమర్శలు గుప్పించారు. తాను కొన్ని సినిమాలు ఆస్కార్ కు వెళ్తాయని అనుకుంటానని, కానీ ఆ సినిమాలు ఆస్కార్ కు నామినేట్ కావని అన్నారు. అదేంటో తనకు అసలు అర్థం కాదని వ్యాఖ్యానించారు. గతంలో కూడా కొన్ని చెత్త సినిమాలకు ఆస్కార్ లు ఇచ్చారని అన్నారు. ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయని, తాను వాటిని ఊహించుకుంటే అవి అసలు ఆస్కార్ వరకూ వెళ్లవని అన్నారు. టాలెంట్ ను తొక్కేస్తున్నారని వ్యాఖ్యానించారాయన. అయితే రెహమాన్ ఈ వ్యాఖ్యలు రెండు నెలల క్రితమే చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. గతంలో ఫిల్మ్ ఫెడరేషన్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఎంపిక చేయకుండా ఓ గుజరాతీ సినిమాను ఎంపిక చేసింది. దాన్ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.  


అలాగే మ్యూజిక్ లో వస్తోన్న ట్రెండ్స్, సవాళ్ల గురించి కూడా రెహమాన్ మాట్లాడారు. అప్పట్లో వారి వద్ద ఒక సినిమాకు ఎనిమిది ట్రాక్‌ లు ఉండేవని, తాను జింగిల్స్ నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి తన వద్ద 16 ట్రాక్‌లు ఉన్నాయని, వాటితోనే మ్యూజిక్ కంపోజ్ చేస్తానని అన్నారు. నిజానికి సంగీతం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అందరూ అనుకుంటారని కానీ అదేమీ అంత కష్టం కాదన్నారు. తనకు సంగీతం మీద ఫ్యాషన్ ఉందని, అందుకే ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందుపుచ్చుకొని ట్యూన్స్ చేస్తానని అన్నారు. తన వైఫల్యాలు ఎవరికీ తెలియవని, తన విజయాల్ని మాత్రమే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని అన్నారు. ఎందుకంటే తనకు సొంత స్టూడియో ఉందని అందుకే మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటామని అన్నారు. సంగీతం మీద ఇష్టం ఉంటే కొత్త కొత్త ప్రయోగాలు చాలా చేయొచ్చని చెప్పారు. పాశ్చాత్య దేశాల సంగీతాన్ని ఎంతో శ్రద్దగా వింటామని, అలాగే మనం కూడా బాగా చేస్తే వాళ్లు ఎందుకు వినరని వ్యాఖ్యానించారు. చేసే పని మీద ఫ్యాషన్ ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పుకొచ్చారు. 


Also Read శృతి హాసన్ మందు కొట్టి ఆరేళ్ళ - బీర్ కూడా నాన్ ఆల్కహాలిక్ అయితేనే