Posani Krishna Murali: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. మరో పది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈసారి వైసీపీని ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమితో కలిసి బరిలో దిగుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే ఒకప్పుడు టీడీపీ, బీజేపీలను విమర్శించిన జనసేనాని.. ఇప్పుడు అదే పార్టీలతో పొత్తు పెట్టుకోవడంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. సింహంలా సింగిల్ గా వెళ్తున్న జగన్ మోహన్ రెడ్డితో అసలు పవన్ కు కంపేరిజన్ ఏంటని కామెంట్లు చేస్తున్నారు. లేటెస్టుగా దర్శక నటుడు పోసాని కృష్ణ మురళి ఇదే విషయం మీద మాట్లాడుతూ పవన్ కు క్రెడిబులిటీ లేదని విమర్శించారు.
వైసీపీ నేత, ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి వీలు దొరికినప్పుడల్లా జనసేనానిని, టీడీపీ అధినాయకత్వాన్ని ఏకిపారేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ లను తిట్టిన పవన్.. ఇప్పుడు వారితోనే పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన మామకు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీలో కూర్చున్నాడని, లేకపోతే అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యేవాడా అని పవన్ కల్యాణ్ అన్నారని పోసాని గుర్తు చేశారు.
'లోకేశ్ అసలు మంత్రి ఎలా అయ్యాడు? చంద్రబాబూ.. నీ కొడుక్కి ఏ అర్హత వుందని రెండు పోర్ట్ పోలియోలు ఇచ్చావ్?' అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారని పోసాని కృష్ణమురళి తెలిపారు. "పందికొక్కుల్లా వందల కోట్లు తినేశాడు.. పైనున్న ఆయన తాత ఆత్మ కూడా క్షోభిస్తుంది. మన కాపులంతా కలిసి ఈ తెలుగు దేశాన్ని ఇంకెన్నాళ్ళు మోయాలి? అంటూ ఎన్నోసార్లు చంద్రబాబును, లోకేశ్ ను పవన్ తిట్టాడు. జనసైనికులను అలగా జనాలు అని వ్యాఖ్యానించిన బాలకృష్ణను కూడా తిట్టాడు. ఇన్ని మాటలు అన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు వాళ్ళతోనే ఎందుకు కలసిపోయాడు?" అని పోసాని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం నచ్చకపోవడం గురించి పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. "నేను కూడా పదిహేను మందికి గుండె ఆపరేషన్లు చేయించాను. లక్షల్లో పెళ్లిళ్లు చేయించా. చాలా మందిని చదివించా. అంత మాత్రాన నేను గొప్పవాడని అవుతానా? మంచివాడిని అయిపోతానా? నీ దగ్గర డబ్బులున్నాయని ఇచ్చావ్. నా దగ్గర ఉన్నాయని ఆపరేషన్లు చేయించా. దానికి ఉత్తమున్ని గాంధీని రాముడిని అవుతానా?" అని అన్నారు.
Also Read: ఎవరైనా అనిల్ రావిపూడిని ముసుగేసి గుద్దితే రూ. 10 వేలు ఇస్తా - ఎస్ఎస్ రాజమౌళి
ఇంకా పోసాని మాట్లాడుతూ.. "ఎవరికైనా క్రిడిబిలిటీ ఉండాలి. జగన్ ఎంతో డెడికేషన్ తో పార్టీ పెట్టాడు. అన్ని వ్యవహారాలు తానే చూసుకుంటాడు. కానీ పవన్ కల్యాణ్ పార్టీకి స్ట్రక్చరే లేదు. ఆయన రాజకీయాల్లోకి రావడంతోనే కాంగ్రెస్ పార్టీని పంచెలు ఊడదీసి కొట్టండి అన్నాడు. జగన్ ను ఓడించాలని కాదు.. నువ్వు గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. నేను ఎలా గెలవాలి, గెలవడానికి నేనేం చెయ్యాలి అని ఆలోచించాలి. జనం నిరుత్సాహంలో ఉన్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా నువ్వు రాజకీయాల్లోకి వచ్చుంటే మంచి నాయకుడివి అయ్యేవాడివి" అని అన్నారు
"కాంగ్రెస్ పాలనలో విసిగిపోయిన ప్రజలకు నేనున్నా అంటూ ఎన్టీఆర్ వచ్చాడు. తొమ్మిది నెలలు రాష్ట్రమంతా తిరిగి సమస్యలు తెలుసుకున్నాడు. జనాలకు తాను ఏం చెయ్యబోతున్నాడో చెప్పాడు. కాంగ్రెస్ చేసిన తప్పులను తెలియజెప్పాడు. అంతేకానీ ఆయన ఎవరినీ వ్యక్తిగతంగా తిట్టలేదు. ఎక్కడ అవినీతి జరిగిందో ఎండ గట్టాడు. హీరో కదా మనకి మంచి చేస్తాడని జనాలు నమ్మి ఆయనకు ఓట్లేశారు. జగన్ కూడా ఆయనలాగే ఒక్కడే జనాల్లో తిరిగాడు. కానీ పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడా?. రావడం రావడంతోనే చెప్పులతో కొట్టండి.. చెప్పుతో కొడతా నా కొడకా అన్నాడు. రామారావు కనీసం ఒరేయ్ అని కూడా అనలేదు. ఒరేయ్ చెప్పుతో కొడతా అని జగన్ ఎప్పుడూ చెప్పు చూపించలేదు"
"జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టినా నవ్వుతూ బయటకు వచ్చాడు. ఎందుకంటే అతనికి డెడికేషన్ ఉంది. జైల్లో పెట్టినా ప్రజల నుంచి విడదీయ లేరు అనే నమ్మకం ఉంది. అలాంటి వ్యక్తిని 'నేను గారు అని ఎందుకు అనాలి. జగన్ అనే పిలుస్తా' అంటావ్. హే జగన్ అని పిలిస్తే అదేమన్నా అచీవ్ మెంటా? రేయ్ జగన్ అనడం గొప్పా?. ఇలా కాకుండా 'నేను పవన్ కళ్యాణ్. మా నాన్న వెంకట్రావు. నేను చిరంజీవి తమ్ముడిని. ఇక్కడ ఈ లోటు పాట్లు ఉన్నాయి. వాటిని నేను బాగుచేస్తాను. ఒక్కరు కూడా ఆకలితో బాధ పడుకుండా చూస్తా. నేను ఈ లక్ష్యంతో వచ్చా. నన్ను ఆశీర్వదించండి' అని జనాల్లోకి వెళ్లుంటే ఆయన ఇప్పుడు ఆకాశమంత ఎత్తులో ఉండేవాడు. అప్పుడు జగనా పవన్ కళ్యానా అనుకునేంత దగ్గరగా ఉండేవాడు" అని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు.
Also Read: ప్రీతి పగడాల ఫస్ట్ మూవీ 'పతంగ్' టీజర్ వచ్చేసింది - ఫీల్ గుడ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ!