Anushka Shetty Ghaati Update: ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ అనుష్క. 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి ఫేమ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ సినిమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తోంది. అయితే అభిమానుల కోసం అన్నట్టుగా అడపాదడపా సినిమాలు చేస్తూ థియేటర్లలోకి వస్తోంది. చాలా కాలం నుంచి అనుష్క తెరపై కనిపించకపోవడంతో ఆమెను అభిమానులు బాగా మిస్ అవుతున్నారు. ఆ లోటును తీర్చడానికే అన్నట్టుగా త్వరలోనే రాబోతున్న అనుష్క పుట్టినరోజు కానుకగా ఆమె నటిస్తున్న "ఘాటి" నుంచి ఒక అప్డేట్ లోడ్ అవుతోంది.
అనుష్క శెట్టి చివరిసారిగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అనే సినిమాతో థియేటర్లలోకి వచ్చి ఆకట్టుకుంది. ఆ తర్వాత తెరమరుగు అయిపోయిన ఈ బ్యూటీ సైలెంట్ గా రెండు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టింది. అందులో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'ఘాటి' కూడా ఒకటి. కొన్నాళ్ల క్రితం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క మెయిన్ లీడ్ గా 'ఘాటి' అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ తాజాగా మేకర్స్ 'ఘాటి' సినిమా నుంచి ఒక సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చి అనుష్క అభిమానులను ఆశ్చర్యపరిచారు.
నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు కావడంతో అదే రోజు 'ఘాటి' మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేస్తామంటూ ప్రకటించి గుడ్ న్యూస్ చెప్పారు అనుష్క ఫ్యాన్స్ కి. అలాగే ఈ పోస్టర్ ద్వారా 'ఘాటి' షూటింగ్ మరో నాలుగు రోజుల్లో కంప్లీట్ అవుతుందని అనౌన్స్ చేశారు. దీంతో ఇప్పటి నుంచే స్వీటీ ఫ్యాన్స్ 'ఘాటీ' సినిమా అప్డేట్ తో పాటు అనుష్క పుట్టినరోజు వేడుకల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక 'ఘాటి' మూవీ కేవలం లేడీ ఓరియంటెడ్ మాత్రమే కాదు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రాబోతుందని తెలుస్తోంది. ఈ అప్డేట్ తో అనుష్క మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైమెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా డైరెక్టర్ క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమాకు దర్శకత్వం వహిస్తూ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశారు. ఇలా మధ్యలోనే 'హరిహర వీరమల్లు' మూవీని వదిలేసి అనుష్కతో 'ఘాటి' అనే ఈ కొత్త సినిమాను మొదలు పెట్టారు. మరోవైపు అనుష్క తన ఫస్ట్ మలయాళ మూవీకి కూడా రెడీ అవుతోంది. 'కథనార్ ది వైల్డ్ సార్సరర్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరి అనుష్క పుట్టిన రోజు కానుకగా ఈ మూవీ నుంచి కూడా ఏదైనా అప్డేట్ వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.