Annpurna Studios Completes 50 Years: చుట్టూ బంజరు భూమి. ఎటు చూసినా రాతి భూభాగం, గుబురు పొదలు, పాములు తిరిగే ప్రాంతం. ఇప్పుడు ఆ ప్లేస్ ఓ వ్యక్తి దార్శనికతతో టాలీవుడ్ ఇండస్ట్రీకే దిక్సూచిగా మారింది. మనకంటూ ఓ పరిశ్రమ ఉండాలని... తెలుగు నటులు ప్రపంచ స్థాయికి ఎదగాలన్న తపనే ఓ వండర్ స్టూడియోస్‌కు పునాది వేసేలా చేసింది. ఆ వ్యక్తే అక్కినేని నాగేశ్వరరావు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి తెలుగు సినీ పరిశ్రమ స్థాపనకు కృషి చేశారు.
50 ఏళ్లు పూర్తి
హైదరాబాద్ జూబ్లీహిల్స్, కృష్ణానగర్ అంటేనే తెలుగు ఇండస్ట్రీకి పెట్టింది పేరు. 1975, ఆగస్ట్ 13న అన్నపూర్ణ స్టూడియోస్‌కు పునాది రాయి వేశారు ఏఎన్నార్. బుధవారానికి ఈ స్టూడియో సరిగ్గా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. తెలుగు గడ్డపై మనకంటూ ఓ అడ్రస్ ఉండాలనే తపనతో ఏఎన్నార్ తన సొంత భూమిలో ఓ ఇంటిని నిర్మించి తొలి అడుగు వేశారు. ఏడాదిలోనే ఓ ఇల్లు, స్టూడియోను సైతం నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూనే ఉంది.
ఇండస్ట్రీకి అక్కినేని చేసిన సేవలను గుర్తించిన అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం బంజారాహిల్స్‌లోని 22 ఎకరాల భూమిని కేటాయించింది. కొండలు, గుట్టలతో ఉన్న బంజరు భూమిని భూతల స్వర్గంగా మార్చారు.
స్టూడియో ప్రారంభంతోనే...
1976, జనవరి 14న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అధికారికంగా ప్రారంభించారు. స్టూడియో అఫీషియల్‌గా ప్రారంభించిన తర్వాత ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. స్టూడియోతో పాటే అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను స్థాపించారు. యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ వరకూ అన్నింటిలోనూ యంగ్ టాలెంట్‌కు శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటే బహుళ షూటింగ్ అంతస్తులు, భారీ బహిరంగ సెట్స్, ప్రపంచ స్థాయి పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దారు. ఇండస్ట్రీలో అత్యాధునిక వసతులు ఉన్న స్టూడియో ఇది. ఇక్కడ భారీ మూవీస్ నుంచి సీరియల్స్ వరకూ అన్నింటినీ చిత్రీకరిస్తున్నారు. ఎన్నో పాన్ ఇండియా స్థాయి మూవీస్ ఇక్కడ భారీ సెట్స్ వేసి షూటింగ్ చేశారు.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభం తర్వాతే క్రమక్రమంగా జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, కృష్ణానగర్‌లు వెలిశాయి. దీంతో పాటే డ్యాన్స్ ఇనిస్టిట్యూట్‌లు, యాక్టింగ్ కోర్సు ఇనిస్టిట్యూట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఒకప్పుడు ఇండస్ట్రీ అంటే గుర్తొచ్చేది మద్రాస్. ఎవరైనా యాక్టింగ్ వైపు వెళ్లాలన్నా... ఏమైనా ప్రయత్నం చేయాలన్నా చెన్నై వైపు చూసేవారు. అన్నపూర్ణ స్డూడియోస్ ఏర్పాటుతో తెలుగు వారికి మరిన్ని అవకాశాలు దగ్గరయ్యాయి. ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలంటే చూసే చూపు అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణానగర్ వైపే. ప్రస్తుతం భారతీయ సినిమాల్లో ఓ మైలురాయిలా నిలిచింది ఈ స్టూడియోస్. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది కంపేర్ చేస్తూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.