మేడమ్ సార్ మేడమ్ అంతే... 'అల వైకుంఠపురములో' ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పే మాట. ఇప్పుడు ఆ మాటలతో ఓ పాట వచ్చింది. విలక్షణ నటుడు రావు రమేష్ హీరోగా నటించిన సినిమా 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో రెండో పాట 'మేడమ్ సార్ మేడమ్ అంతే' (Madam Sir Lyrical Video)ను ఈ రోజు విడుదల చేశారు.
అల్లు అర్జున్ వీరాభిమానిగా అంకిత్ కొయ్య...
రొమాంటిక్ పాటలో బన్నీ సినిమాల్లో సీన్లు!
'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో రావు రమేష్ తనయుడిగా అంకిత్ కొయ్య నటించారు. ఆయన జోడీగా రమ్య పసుపులేటి కనిపించనున్నారు. వాళ్లిద్దరి మీద 'మేడమ్ సార్ మేడమ్ అంతే' పాటను తెరకెక్కించారు. అల్లు అర్జున్ వీరాభిమాని ఈ సన్నాఫ్ సుబ్రమణ్యం. ప్రేమించిన అమ్మాయి తన ముందుకు వచ్చిన ప్రతిసారీ... తన అభిమాన హీరో సినిమాల్లోని హీరోయిన్ ఇంట్రడక్షన్ సన్నివేశాల్లో ఆమెను ఊహించుకుంటాడు.
'సన్నాఫ్ సత్యమూర్తి'లో పూజా హెగ్డేను అల్లు అర్జున్ తొలిసారి చూసేది ఎప్పుడో తెలుసా? స్విమ్మింగ్ ఫూల్ నుంచి పూజ బయటకు వస్తున్నప్పుడు. 'దేశముదురు' సినిమాలో హన్సికను సన్యాసినిగా ఉన్నప్పుడు చూస్తారు బన్నీ. 'జులాయి'లో బస్ స్టాప్ దగ్గర ఇలియానాను! ఈ సీన్లతో పాటు 'ఆర్య'లో హీరో హీరోయిన్ల ఫస్ట్ మీటింగ్ కూడా 'మేడమ్ సార్ మేడమ్ సార్' పాటలో రీ క్రియేట్ చేశారు.
Also Read: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?
కళ్యాణ్ నాయక్ సంగీతంలో సిద్ శ్రీరామ్ పాట!
'మారుతి నగర్ సుబ్రమణ్యం' చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీత దర్శకుడు. ఆయన అందించిన బాణీకి భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించగా... 'మేడమ్ సార్ మేడమ్ సార్' పాటను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించారు.
'మేడమ్ సార్ మేడమ్ అంతే' సాంగ్ విడుదలైన సందర్భంగా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''రావు రమేష్ గారి ఫస్ట్ లుక్, టైటిల్ సాంగ్ ఆల్రెడీ విడుదల చేశాం. వాటికి మంచి స్పందన లభించింది. భాస్కరభట్ల గారు తొలి పాటతో పాటు ఈ 'మేడమ్ సార్ మేడమ్ అంతే'కూ అద్భుతమైన లిరిక్స్ అందించారు. సినిమాలో అంకిత్ కొయ్య పాత్రకు, అల్లు అర్జున్ గారికి చిన్న కనెక్షన్ ఉంటుంది. ప్రస్తుతానికి అదేమిటో సస్పెన్స్. రమ్య పసుపులేటి ఈతరానికి చెందిన అమాయకపు అమ్మాయి పాత్రలో నటించారు. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి, కవ్విస్తాయి. లిధా మ్యూజిక్ ద్వారా పాటల్ని విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు.
రావు రమేష్, ఇంద్రజ ఓ జంటగా... అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా నటిస్తున్న ఈ సినిమాలో హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ - భాస్కరభట్ల రవికుమార్ - కళ్యాణ్ చక్రవర్తి, కళా దర్శకత్వం: సురేష్ భీమంగని, కూర్పు: బొంతల నాగేశ్వర్ రెడ్డి, ఛాయాగ్రహణం: ఎంఎన్ బాల్ రెడ్డి, క్రియేటివ్ హెడ్: గోపాల్ అడుసుమల్లి, సహ నిర్మాతలు: రుషి మర్ల - శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల - మోహన్ కార్య, కథ - కథనం - సంభాషణలు - దర్శకత్వం: లక్ష్మణ్ కార్య.