Chuttamalle Song From Devara: ఈరోజుల్లో ఒక తెలుగు సినిమాలోని సీన్.. వేరే సినిమాలోని సీన్‌తో కాస్త పోలిక ఉన్నా చాలు.. అది కాపీ అంటూ సోషల్ మీడియాలో మేకర్స్‌పై మీమ్స్, ట్రోల్స్ వచ్చేస్తున్నాయి. సీన్ మాత్రమే కాదు.. పాటలు కూడా అంతే. అందుకే దర్శకుల కంటే మ్యూజిక్ డైరెక్టర్స్‌పైనే ఎక్కువగా ట్రోల్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మ్యూజిక్‌లో లోపాలను వెతికి ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్‌పైన అయితే మీమ్స్ క్రియేట్ చేస్తారు కంటెంట్ క్రియేటర్స్. ఇప్పుడు అనిరుధ్ రవిచందర్‌పై కూడా అలాంటి ట్రోల్సే వస్తున్నాయి. ‘దేవర’లో రెండో పాట విడుదల అవ్వగానే ఆ ట్యూన్ తనది కాదని డిసైడ్ చేసేస్తున్నారు.


గంటల్లోనే వైరల్..


కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ‘ఫియర్ సాంగ్’ విడుదలయ్యి మాస్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు యూత్ కోసం రెండో పాటను విడుదల చేశారు. ఎన్‌టీఆర్, జాన్వీ కపూర్ మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ ఇది. ‘చుట్టుమల్లే’ పాట విడుదల అవ్వగానే చాలామంది మ్యూజిక్ లవర్స్ దీనిని విపరీతంగా ఎంజాయ్ చేశారు. కొన్ని గంటల్లోనే మిలియన్స్ వ్యూస్, లైక్స్ వచ్చాయి. కానీ కొందరు మాత్రం ఈ పాటను ఎక్కడో విన్నట్టు ఉందే అంటూ వేరే పాటతో పోలుస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.


ఆ పాటతో పోలికలు..


ఒకప్పుడు యూట్యూబ్‌లో శ్రీలంకకు చెందిన సిన్హాలా లాంగ్వేజ్‌లో విడుదలయిన ఒక పాట విపరీతంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే ‘మనికే మగే హితే’. ఆ పాటతో పాటు పాడిన సింగర్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ పాటే వినిపించింది. దానిపై పాపులర్ సెలబ్రిటీలు సైతం రీల్స్ చేశారు. ఇక ‘దేవర’ నుంచి తాజాగా విడుదలయిన ‘చుట్టమల్లే’ పాట కూడా ‘మనికే మగే హితే’ పాటలాగానే ఉందంటూ మీమ్స్ వస్తున్నాయి. ట్యూన్ కూడా అంతా సేమ్ ఉందంటూ కొందరు అనిరుధ్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.






ఆ సినిమాకు కూడా..


మామూలుగా ఇతర సంగీత దర్శకులతో పోలిస్తే అనిరుధ్ రవిచందర్‌పై అంతగా ట్రోల్స్ రావు. కానీ ఎప్పుడో ఒకసారి ట్యూన్స్‌ను కాస్త ఇన్‌స్పైర్ అవుతూ తాను కూడా ట్రోల్ కంటెంట్ అవుతాడు. ఇంతకు ముందు తను సంగీతం అందించిన ‘విక్రమ్’ మూవీపై కూడా ఇలాగే ట్రోల్స్ వచ్చాయి. లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’కు అనిరుధ్ అందించిన సంగీతం హైలెట్ అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ కొన్నాళ్ల తర్వాత అందులోని మ్యూజిక్, ఒక ఫారిన్ ఆల్బమ్‌లోని మ్యూజిక్ ఒకేలా ఉందని బయటపడడంతో అనిరుధ్‌పై ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు ‘దేవర’ పాటతో మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.



Also Read: 'దేవర' సెకండ్‌ సింగిల్‌ వచ్చేసింది - ఎన్టీఆర్‌, జాన్వీల రొమాన్స్‌ మామూలుగా లేదుగా, ఆకట్టుకుంటున్న సాంగ్