దసరా, క్రిస్మస్, సంక్రాంతి అని తేడాల్లేవ్! ఇప్పుడు ప్రతి పండక్కి రెండు మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. లాంగ్ వీకెండ్, హాలిడేస్ సీజన్ అని కాదు... సాధారణ వారాల్లోనూ స్టార్ హీరోలకు సోలో రిలీజ్ దొరకడం గగనం అవుతోంది. ఈ ఏడాది డిసెంబర్ 22న షారుఖ్ ఖాన్ 'డంకి', ప్రభాస్ 'సలార్' విడుదలకు రెడీ అయ్యాయి. 


సంక్రాంతి 2024కి అయితే తెలుగులో నాలుగైదు సినిమాలు బరిలో దిగడానికి రెడీగా ఉన్నాయి. తమిళనాట అయితే మాజీ భార్య భర్తల సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడనున్నాయి. ముఖ్యంగా ఆయా సినిమాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, ధనుష్ నటించడం విశేషం. హిందీకి వెళితే... డిసెంబర్ 1న 'యానిమల్'కు పోటీగా మాజీ ప్రేయసి భర్త సినిమా వస్తోంది. 


యానిమల్ వర్సెస్ శ్యామ్ బహదూర్!
బాలీవుడ్ యంగ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' సినిమాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సినిమా 'యానిమల్'. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక కథానాయిక. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. అదే రోజున థియేటర్లలోకి వస్తున్న మరో సినిమా 'శ్యామ్ బహదూర్'.


'శ్యామ్ బహదూర్' సినిమాలో విక్కీ కౌశల్ హీరో. ఆయన ఆర్మీ ఆఫీసర్ రోల్ చేశారు. పీరియాడిక్ నేపథ్యంలో 'శ్యామ్ బహదూర్'ని తెరకెక్కించారని ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో ఫాతిమా సనా షైక్ లుక్ కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. 


ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే... విక్కీ కౌశల్ ఎవరో కాదు, ఒకప్పుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor)తో పీకల్లోతు ప్రేమలో ఉన్న కత్రినా కైఫ్ భర్త. సల్మాన్, రణబీర్... ఇద్దరితో కత్రినాకు బ్రేకప్ అయ్యాయి. రణబీర్ తర్వాత విక్కీతో ఆమె వివాహం జరిగింది. ఇప్పుడు కత్రినా మాజీ ప్రియుడు, భర్త సినిమాలు ఓకే రోజున థియేటర్లలో వస్తుండటం విశేషం. 


Also Read 50 రూపాయలకు 'మంగళవారం' సినిమా - ఏపీ, తెలంగాణలో టికెట్ రేట్లు చూశారా?


'యానిమల్' సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం. అందులో తండ్రి కొడుకుల మధ్య బాండింగ్, భార్య భర్తల మధ్య అనుబంధం కూడా ఉందని ప్రచార చిత్రాలతో సందీప్ రెడ్డి వంగా చెప్పారు. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' సినిమాలు, 'యానిమల్' టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ఆయన సినిమాను ఎలా తీసి ఉంటారో ఊహించవచ్చు. దాంతో అంచనాలు పెరిగాయి. 'ఉరి సర్జికల్ స్ట్రైక్' తర్వాత విక్కీ కౌశల్ మరోసారి ఆర్మీ క్యారెక్టర్ చేయడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. 


Also Read : టికెట్ రేట్లు తక్కువే - రక్షిత్ శెట్టి 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి'కి ప్రేక్షకులు వస్తారా?



రెండు సినిమాల్లో ఏది ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుంది? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ప్రస్తుతానికి రెండు సినిమాల ప్రచార కార్యక్రమాలు జోరుగా హుషారుగా సాగుతున్నాయి. అయితే... 'యానిమల్' తెలుగులో కూడా విడుదల అవుతోంది. దక్షిణాది నుంచి ఆ సినిమాకు కాస్త ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.