Ranbir Kapoor's Animal Movie Release In Japan : టాలీవుడ్ మూవీస్ వరుసగా జపాన్‌లో రిలీజై సత్తా చాటుతున్నాయి. రీసెంట్‌గానే దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి రిలీజ్ కాగా ప్రభాస్ సైతం మూవీ ప్రమోషన్లలో సందడి చేశారు. అలాగే, ఎన్టీఆర్ 'దేవర', 'కల్కి', 'RRR' సినిమాలు కూడా అక్కడ రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా 'యానిమల్' సైతం అక్కడ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్, 'అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'యానిమల్'. 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. తొలుత వయలెన్స్, ఇతర కంటెంట్‌పై విమర్శలు వచ్చినా మంచి విజయం సాధించింది.
జపాన్‌లో రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీ జపాన్‌లో 2026, ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ టి సిరీస్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఫేమస్ మూవీ క్రిటిక్, కలెక్షన్స్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్స్ సైతం ఈ ప్రకటనను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ''యానిమల్' జపాన్ చేరుకుంది' అని పేర్కొన్నారు.
'యానిమల్'లో రణబీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్, రవి గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. టి సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
స్టోరీ ఏంటంటే?
దేశంలోనే రిచ్చెస్ట్ పర్సన్, స్వస్తిక్ స్టీల్స్ అధినేత బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) కుమారుడు రణ్ విజయ్ (రణబీర్)కు చిన్నప్పటి నుంచీ నాన్నంటే చాలా ఇష్టం. ఎవరినైనా ఎదిరించే ధైర్యం. అయితే, తన బిజినెస్‌తో బిజీగా ఉంటూ కొడుకును పట్టించుకోడు బల్బీర్. విజయ్ దూకుడుగా చేసే పనులు బల్బీర్‌కు నచ్చవు. దీంతో తండ్రీ కొడుకుల మధ్య గొడవలు జరుగుతాయి.
తాను లవ్ చేసిన గీతాంజలి (రష్మిక)ని పెళ్లి చేసుకున్న విజయ్ అమెరికా వెళ్లిపోతాడు. కొన్నేళ్ల తర్వాత తండ్రిపై హత్యాయత్నం జరిగిన విషయాన్ని తెలుసుకుని భార్యా పిల్లలతో ఇండియాకి వస్తాడు. అసలు బల్బీర్‌ను హత్య చేయాలని చూసింది ఎవరు? తన శత్రువును విజయ్ ఎలా గుర్తించాడు? శత్రువు నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? విజయ్ ఇండియాకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో వచ్చిన మూవీ మంచి సక్సెస్ అందుకుంది.