Pradeep Machiraju's New Movie Release Date: ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju).. ఈ పేరు గురించి తెలుగు ఆడియన్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెర యాంకర్‌గా తనదైన టైమింగ్, కామెడీ పంచులతో టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఇప్పుడు 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'తో మళ్లీ హీరోగా ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు.


మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్


ఈ సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 11న 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' (Akkada Ammayi Ikkada Abbayi) సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని హీరో ప్రదీప్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 'ఈ సమ్మర్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు తమ కథతో.. టన్నుల కొద్దీ వినోదంతో వస్తున్నారు.' అని క్యాప్షన్ ఇచ్చారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నితిన్, భరత్ దర్శకత్వం వహించారు. మూవీలో ప్రదీప్ సరసన జబర్దస్త్ ఫేం దీపికా పిల్లి (Deepika Pilli) నటిస్తున్నారు. సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జీఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాంక్స్ & మంకీస్ బ్యానర్‌పై సినిమా రూపొందిస్తున్నారు. 






నాలుగేళ్ల తర్వాత మళ్లీ హీరోగా..


'30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ దాదాపు నాలుగేళ్ల తర్వాత మరోసారి హీరోగా ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హిట్ మూవీ టైటిల్‌తోనే వస్తుండడం మరో విశేషం. ఫస్ట్ మూవీలో సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత ప్రదీప్ నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ పవన్ మూవీ టైటిల్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


Also Read: 'ఇండస్ట్రీలో ఎవరూ బలవంతం చేయరు' - మీడియాలో హైలెట్ కావడానికే అలా వస్తున్నారంటున్న సీనియర్ నటి అన్నపూర్ణమ్మ


టాప్ యాంకర్స్‌లో ఒకడిగా..


ప్రస్తుతం బుల్లితెర టాప్ యాంకర్స్‌లో ప్రదీప్ మాచిరాజు ఒకరు. ఆయన టైమింగ్, పంచులు, అద్భుతమైన కామెడీతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అటు యాంకర్‌గానే కాకుండా ఇటు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసి అలరించారు. ఫస్ట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. యాంకర్‌గానూ కొన్ని షోలకే పరిమితమయ్యారు. ఇప్పుడు మళ్లీ మరో సినిమాతో హీరోగా వస్తున్నారు. ఈ సినిమా కోసమే ఆయన గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మూవీ మంచి సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.