Ananya Nagalla about Casting Couch: టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. అసలు తెలుగు మేకర్స్ ఎవరూ ఇక్కడి అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు అని ప్రేక్షకులు ఎప్పుడూ అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. అలాంటి హీరోయిన్లలో అనన్య నాగళ్ల కూడా ఒకరు. ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న అనన్య.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో లీడ్ రోల్‌లో నటిస్తోంది. తాజాగా తను పాల్గొన్న ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి, ఇంట్లో తెలియకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన పరిస్థితుల గురించి బయటపెట్టింది.


అలాంటి అనుభవాలు లేవు..


‘‘ఇండస్ట్రీకి వచ్చే ముందే చాలామంది సలహా ఇచ్చారు. నిన్ను నువ్వు ఎలా చూపించుకుంటావో.. అవతలవైపు నుండి కూడా నీకు అదే రెస్పాన్స్ వస్తుంది. నేను చేసిన రోల్స్ అయ్యిండొచ్చు, తెలుగమ్మాయి అని అయ్యిండొచ్చు క్యాస్టింగ్ కౌచ్ లాంటి అనుభవాలు ఒక్కటి కూడా ఎదురవ్వలేదు’’ అని చెప్పుకొచ్చింది అనన్య. ప్రస్తుతం తక్కువ బడ్జెట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నానని బయటపెట్టింది. ఇక తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ తను సింగిల్ అని, ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి మాత్రం రెడీగా లేనని చెప్పింది. ఇండస్ట్రీలో పనిచేసేవారికి చాలా ఆప్షన్స్ ఉంటాయని, అందుకే వారితో రిలేషన్‌షిప్ కొనసాగించడం కష్టమేమో అని తన అభిప్రాయాన్ని తెలిపింది.


సెటిల్ అవుతాను అనుకోలేదు..


బీటెక్, ఎల్ఎల్‌బీ చేసిన తర్వాత యాక్టింగ్‌లోకి అడుగుపెట్టడానికి గల కారణాన్ని బయటపెట్టింది అనన్య. ‘‘అనుకోకుండా ఏం రాలేదు. చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ట్రై చేద్దామనుకున్నాను కానీ ఇందులోనే సెటిల్ అవుతాను అనుకోలేదు’’ అని చెప్పింది. ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లాంటివారు ఎవరూ లేరని, తన తల్లిదండ్రులకు చెప్పకుండానే వచ్చానని తెలిపింది. ‘‘మొదటి మూవీ షూటింగ్ అయిపోయేంత వరకు కూడా ఇంట్లో తెలియదు. షూట్ అయిపోయి రిలీజ్ అవుతున్న టైమ్‌లో ముందుగా అన్నయ్యకు చెప్పాను. చెప్పగానే షాక్ అయ్యాడు. చెప్తే అస్సలు ఒప్పుకోరు. అందుకే చేసిన తర్వాత చెప్తే.. మహా అయితే తిడతారు ఇంకేం చేయలేరు కదా అనుకున్నాను. మూవీ విడుదలయ్యే 2 నెలల ముందు చెప్పాను. ఆ 2 నెలలు ఇంట్లో చాలా గొడవ జరిగింది’’ అని రివీల్ చేసింది.


దూరం బంధువులు..


తను ఇంట్రోవర్ట్ అని, అందుకే అవకాశాలు కోసం తానే స్వయంగా ఎవరి దగ్గరికి వెళ్లలేదని తెలిపింది అనన్య నాగళ్ల. తనపై సన్నిహితులు, కుటుంబ సభ్యులు చేసిన నెగిటివ్ కామెంట్స్ గురించి కూడా చెప్పుకొచ్చింది. ‘‘ముందుగా నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అప్పుడే నా క్లోజ్ ఫ్రెండ్స్ అంతా నీకు అవసరమా, నువ్వు అంత అందంగా కూడా లేవు అన్నారు. మురళీ మోహన్ మాకు దూరం బంధువులు. ఆయన వెళ్లారు కదా అని చెప్పేదాన్ని. కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. మావయ్య వాళ్లు కొన్నిరోజులు మాట్లాడలేదు కూడా’’ అని చెప్పింది. ఇప్పటికీ తన తల్లి తన సినిమాల గురించి బయట మాట్లాడొద్దని చెప్తుంటారని తెలిపింది.


Also Read: అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిల పెళ్లి బంధానికి 13 ఏళ్లు, వీరి లవ్ స్టోరీ మీకు తెలుసా?