ఒక సినిమా హిట్ అయ్యిందంటే చాలు.. ఆ నటీనటులు చేస్తున్న తరువాతి సినిమా ఏంటి అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఒకవేళ ఆ మూవీ బ్లాక్‌బస్టర్ అయితే.. ప్రేక్షకులు ఎదురుచూపులు ఒక రేంజ్‌లో ఉంటాయి. ఇక విజయ్ దేవరకొండ సోదరుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.. కెరీర్ మొదటి నుండి ఫ్యామిలీ సినిమాలనే తెరకెక్కిస్తూ వచ్చాడు. ఒక్కసారిగా ఫ్యామిలీ జోనర్ నుండి యూత్‌ఫుల్ జోనర్‌కు షిఫ్ట్ అవుతూ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ మూవీ తర్వాత ఆనంద్.. ‘గం.. గం.. గణేశా’ అనే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 


కొత్త డైరెక్టర్‌తో..
ఆనంద్ దేవరకొండ కెరీర్‌కు ‘బేబి’ మూవీ పెద్ద బూస్టప్‌నే ఇచ్చింది. ఇక ఆ మూవీ తర్వాత వెంటనే ‘గం.. గం.. గణేశా’ అనే డిఫరెంట్ టైటిల్‌ ఉన్న సినిమాతో ఆనంద్ సిద్ధమయ్యాడు. తాజాగా దీని ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. దీన్ని బట్టి చూస్తే ‘గం.. గం.. గణేశా’ ఒక యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. హై లైఫ్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి.. ఈ మూవీని నిర్మిస్తున్నారు. ‘గం.. గం.. గణేశా’ చిత్రంతో ఉదయ్ శెట్టి దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. 


సమంత చేతుల మీదుగా..
సమంత చేతుల మీదుగా ఆనంద్ దేవరకొండ నటించిన ‘గం.. గం.. గణేశా’ ఫస్ట్ లుక్‌ విడుదలయ్యింది. ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన తర్వాత ‘ఇలాంటి ఒక కిల్లర్ ఫస్ట్ లుక్‌ను షేర్ చేస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతున్నాను. ఆనంద్ దేవరకొండ నటిస్తున్న గం.. గం..గణేశా చాలా అద్భుతంగా అనిపిస్తోంది. టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్’ అంటూ ‘గం.. గం.. గణేశా’ కోసం పనిచేసిన మూవీ టీమ్‌ను ట్యాగ్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సమంత. ఆ ఫస్ట్ లుక్‌లో ఆనంద్.. రెండు చేతుల్లో రెండు గన్స్ పట్టుకొని నిలబడగా.. తన కింద అంతా రౌడీల గ్యాంగ్ ఉంది. అంతే కాకుండా ఈ పోస్టర్‌లో ఒక కారు గాలిలో ఎగురుతూ కూడా కనిపిస్తోంది. దీంతో ఇది యాక్షన్ ఎంటర్‌టైనర్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. పైగా ‘గం.. గం.. గణేశా’కు క్యాప్షన్‌గా రన్ - ఫన్ - గన్ అని ఉండడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.






రిలీజ్ డేట్ కూడా త్వరలోనే..
ఇప్పటికే ‘గం.. గం.. గణేశా’ షూటింగ్ చాలావరకు పూర్తయినట్టు సమాచారం. అంతే కాకుండా అప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి కూడా చేరుకుందట. ఫస్ట్ లుక్ కాస్త లేటుగా రిలీజ్ అయినా కూడా త్వరలోనే దీనికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మూవీ టీమ్ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇక ‘గం.. గం.. గణేశా’లో ఆనంద్ దేవరకొండకు జంటగా ప్రగతి శ్రీవాస్తవ నటిస్తోంది. కరిష్మా కూడా మరో హీరోయిన్ రోల్‌లో కనిపించనుంది. వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్.. ఈ మూవీలో కామెడియన్స్‌గా కనిపించనున్నారు. యూత్‌ఫుల్ సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ టాలీవుడ్‌లో తన సత్తా చాటుకున్న చేతన్ భరద్వాజ్.. ‘గం.. గం.. గణేశా’కు కూడా సంగీతాన్ని అందించాడు. కార్తిక్ శ్రీనివాస్ ఈ మూవీకి ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా.. ఆదిత్య జవ్వాడి కెమెరా బాధ్యతను స్వీకరించారు.


Also Read: గోపిచంద్, శ్రీను వైట్ల సినిమా పూజ, పవన్, విజయ్‌ల సరసన ఛాన్స్ కొట్టిన యంగ్ హీరోయిన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial