Buddy Trailer Out Now: టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారని సినీ సెలబ్రిటీలు అంటుంటారు. ఇప్పుడు అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అల్లు శిరీష్. ఈ అల్లు హీరో.. వెండితెరపై కనిపించి చాలాకాలమే అయ్యింది. ఇన్నాళ్ల తర్వాత ‘బడ్డీ’ అనే డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు శిరీష్. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యింది. ఇందులో శిరీష్.. చాలా స్టైలిష్ లుక్‌తో కనిపించడంతో పాటు యాక్షన్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.


తిరగబడిన టెడ్డీ బేర్..


‘బడ్డీ’ ట్రైలర్ మొదల్వగానే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను చూపిస్తారు. అప్పుడే బ్యాక్‌గ్రౌండ్ నుండి ఒక డైలాగ్ మొదలవుతుంది. ‘‘చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు అన్యాయం జరిగినా.. ఎదురుతిరిగిన సింహాన్ని, పులిని, చిరుతను చూసుంటారు. అన్యాయంపై తిరగబడిన ఒక టెడ్డీ బేర్‌ను చూశారా?’’ అంటూ బేస్ వాయిస్‌తో సాయి కుమార్ చెప్పే డైలాగ్ పూర్తవ్వగానే టెడ్డీ ఎంట్రీ ఇస్తుంది. ఒక టెడ్డీ బేర్‌ను చూస్తే చాలా క్యూట్‌గా ఉంటుంది. దాంతో ఆడుకోవాలనిపిస్తుంది. కానీ ‘బడ్డీ’ మూవీలో టెడ్డీ అలా కాదు.. విలన్స్‌తో ఫైట్ చేయడం, అన్యాయాన్ని ఎదిరించడం ఈ టెడ్డీకి బాగా అలవాటు. అలా ‘బడ్డీ’ ట్రైలర్‌లో తగ్గేదే లే అంటూ విలన్స్‌పై ప్రతాపం చూపిస్తుంది టెడ్డీ.


అలీ కామెడీ..


భయం లేని టెడ్డీకి ఒకసారి ఒక వ్యక్తి సహాయం కావాల్సి వస్తుంది. ‘ఇలాంటి పరిస్థితుల్లో నాకు సాయం చేయగలిగేది అతనొక్కడే’ అని టెడ్డీ చెప్పగానే హీరోగా అల్లు శిరీష్ ఎంట్రీ ఇస్తాడు. కెప్టెన్ ఆదిత్య రామ్‌గా చాలా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాడు శిరీష్. ఆ తర్వాత కమెడియన్‌గా అలీ ఎంట్రీ, తన కామెడీ టైమింగ్.. ట్రైలర్‌లో కాస్త వినోదాన్ని నింపాయి. అప్పుడే అదే ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే ఒక ఉద్యోగిగా హీరోయిన్ ప్రిషా రాజేశ్ సింగ్ ఎంట్రీ ఇస్తుంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే ‘బడ్డీ’ మూవీలో హీరోకు తెలియకుండా ప్రేమించే పాత్రలో హీరోయిన్ కనిపించనుందని తెలుస్తోంది. ఇక ‘బడ్డీ’లో జాలి, దయ లేని విలన్‌గా నటించాడు అజ్మల్ అమీర్.



టెడ్డీ యాక్షన్..


అప్పటివరకు కూల్‌గా సాగిపోయిన ‘బడ్డీ’ ట్రైలర్.. అజ్మల్ అమీర్ ఎంట్రీతో వైలెంట్‌గా మారుతుంది. అల్లు శిరీష్ యాక్షన్, విజువల్స్.. ఇలా అన్నీ కలిపి ఈ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. అల్లు శిరీష్‌తో పాటు టెడ్డీ చేసే యాక్షన్ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. సామ్ ఆంటన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బడ్డీ’.. జులై 26న విడుదల కానుందని ట్రైలర్ చివర్లో రివీల్ చేశారు మేకర్స్. స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించింది. 2022లో ‘ఊర్వశివో రాక్షసివో’ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు అల్లు శిరీష్. మళ్లీ ఇంతకాలం తర్వాత ‘బడ్డీ’ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో హిట్ కొట్టడానికి సిద్ధమయ్యాడు.



Also Read: అటు సల్మాన్... ఇటు రజనీ... అల్లు అర్జున్‌కు మంచి ఛాన్స్ మిస్!?