అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

అల్లు రామలింగయ్య 101వ జయంతిని పురస్కరించుకొని ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లు అర్జున్ తనయుడు అయాన్ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగడం విశేషం.

Continues below advertisement

లెజెండరీ నటులు, పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య 101వ జయంతిని పురస్కరించుకొని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ లోని అల్లు బిజినెస్ పార్క్ లో ఈ కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరగడం విశేషం. దానికి తోడు మనవడు అయాన్ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ, అల్లు శిరీష్, అల్లు అర్జున్ కూతురు అర్హతతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Continues below advertisement

ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఆయన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. గత ఏడాది అల్లు రామలింగయ్య శతజయంతిని పురస్కరించుకుని అల్లు స్టూడియోని ప్రారంభించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అల్లు స్టూడియోస్ ప్రారంభమైంది. ఇక ఇప్పుడు అల్లు బిజినెస్ పార్క్ లో ఆయన కాంస్య విగ్రహావిష్కరణ చేయడం విశేషం. ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ మాట్లాడుతూ.." అల్లు రామలింగయ్య తాత గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుట్టినరోజున ఆయన మనతో లేకపోయినా, ఆయన మంచి పనులు ఎప్పుడు మనతో ఉన్నాయి. తాత గారి దీవెనలు మాపై ఎప్పుడూ ఉంటాయి" అని అన్నాడు.

అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అల్లు రామలింగయ్య గారితో ఉన్న మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. సుమారు 1000 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న లెజెండరీ నటులు అల్లు రామలింగయ్య తన సినీ జీవితంలో మూడు తరాల ప్రేక్షకులను అలరించారు. తనదైన నటనతో 50 ఏళ్ల పాటు సినిమాల్లో నవ్విస్తూ యావత్ సినీ ప్రేక్షకులను అలరించిన ఆయన తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని కల్పించుకున్నారు. అయితే అంతా బానే ఉన్నా ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మిస్ అయ్యారు. ఆయనతో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం గమనార్హం.

అందుకు కారణం బన్నీ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ తో బిజీగా ఉండడమే అని సమాచారం. షూటింగ్లో బిజీగా ఉండడం వల్లే ఈ కార్యక్రమానికి బన్నీ హాజరు కాలేదట. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప 2' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 'పుష్ప' ని మించి 'పుష్ప 2' ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది ఈసినిమాతో ఎలాగైనా 1000 కోట్లు కొల్లగొట్టేలా సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందిస్తున్నారు. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement