పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సేవాగుణంలోనూ తాను ముందుంటానని నిరూపించుకున్నారు. రాష్ట్రం కాని రాష్ట్రంలో ఓ పేద విద్యార్థినిని చదివేందుకు ముందుకు వచ్చి అక్కడి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. అలెప్పీలో ఓ నర్సింగ్ విద్యార్థిని చదువుకు అవసరమయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానంటూ  జిల్లా కలెక్టర్ మైలవరపు కృష్ణతేజకు హామీ ఇచ్చారు. 
We Are for Alleppey ప్రాజెక్ట్ లో భాగంగా అల్లు అర్జున్ ఈ సహాయం అందించేందుకు అంగీకరించారు.


ఏంటీ We are for Alleppey
2018 లో వచ్చిన కేరళ భీకర వరదల సమయంలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రత్యేకించి పున్నమనాడ బ్యాక్ వాటర్స్ లో ఉండే  అలెప్పీ ప్రాంతం వరదల ధాటికి కకావికలం అయ్యింది. దీంతో అప్పటికే 'ఆపరేషన్ కుట్టునాడు' ద్వారా లక్షలాది మందిని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అప్పటి అలెప్పీ సబ్ కలెక్టర్, ప్రస్తుత జిల్లా కలెక్టర్ మైలవరపు కృష్ణతేజ 'ఐయామ్ ఫర్ అలెప్పీ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరదసహాయం నుంచి పునరవాసం, ఉపాధి కల్పన, ఇళ్ల నిర్మాణం లాంటి అనేక కార్యక్రమాలను ఆ ప్రోగ్రాంలో భాగంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, యాంకర్ సుమ, రాజమౌళి బాహుబలి బృందం ఇలా అనేక మంది తెలుగు రాష్ట్రాల ప్రముఖులు తమ వంతు సహాయం అందించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా కొవిడ్ సమయంలో మరణించిన తల్లితండ్రుల పిల్లలను ఆదుకునేందుకు We are Aleppey అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గా కృష్ణతేజ చేపట్టారు. 


పేద విద్యార్థిని కోసం అల్లు అర్జున్ :
We are for Alleppey లో భాగంగా కొవిడ్ కల్లోలంలో తండ్రిని కోల్పోయిన ఓ విద్యార్థిని నర్సింగ్ చదువు నిమిత్తం ఆర్థిక సహాయం కావాల్సి ఉంది. ఆ విద్యార్థినికి మెరిట్ ర్యాంకు వచ్చినా ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో సమయం మించిపోయింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ కృష్ణతేజ...We Are Aleppey లో ఆమెకు సహాయం అందించాలని భావించారు. అప్పటికే ఈ ప్రోగ్రాంలో భాగస్వామిగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహాయాన్ని జిల్లా కలెక్టర్ కోరారు. మేనేజ్ మెంట్ కోటాలో కేరళలో డిమాండ్ ఉండే నర్సింగ్ సీటు సంపాదిస్తామని...విద్యార్థిని కోసం ఏడాది ఫీజు చెల్లిస్తే బాగుంటుందని కలెక్టర్ కోరటంతో... అంగీకరించిన అల్లు అర్జున్..ఏడాది కాదు నాలుగు సంవత్సరాలు..ఆ యువతి నర్సింగ్ కోర్సు పూర్తి చేసేంత వరకూ పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని తెలిపారు. ఇందుకోసం నాలుగేళ్లలో దాదాపు 8-10 లక్షల రూపాయలు ఖర్చు కానుండగా మొత్తం తానే భరిస్తానని...ఆ యువతిని చదువు పూర్తయ్యేంతవరకూ దత్తత తీసుకుంటానని చెప్పి రియల్ ఐకాన్ స్టార్ నని నిరూపించుకున్నాడు బన్నీ. ఈ విషయాన్ని అలెప్పీ కలెక్టర్ కృష్ణతేజ తన ఫేస్ బుక్ పోస్ట్ లో షేర్ చేసుకున్నారు. 


అల్లు అర్జున్ కు కృతజ్ఞతలు : మైలవరపు కృష్ణతేజ, అలెప్పీ జిల్లా కలెక్టర్
కట్టానం లో St.Thomas Nursing కాలేజ్ లో విద్యార్థినికి మేనేజ్ మెంట్ కోటా సీటు దక్కింది. అల్లు అర్జున్ ఇచ్చిన హామీపై కళాశాల ప్రతినిధులతో కలెక్టర్ చర్చించారు. "ఆ విద్యార్థిని ఇక ఏ భయం లేకుండా చదువుకుంటుంది. ఆమె కళ్లలో ఇప్పుడు ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. తన తల్లిని, సోదరుడిని భవిష్యత్తులో బాగా చూసుకోగలదు. సహాయం అందించిన ఐకాన్ అల్లు అర్జున్ కు కృతజ్ఞతలు" అని తన ఫేస్ బుక్ పేజ్ లో జిల్లా కలెక్టర్ కృష్ణతేజ పోస్ట్ షేర్ చేసుకున్నారు. అల్లు అర్జున్ ను ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుచుకునే కేరళీయులు బన్నీ అందించిన ఈ సహాయంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.