టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారే అంశాల్లో హీరోల రెమ్యూనరేషన్ కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల పారితోషకాలు వందల కోట్లలో ఉన్నాయి. చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా అందరూ భారీ మొత్తంలోనే తీసుకుంటున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే రెమ్యూనరేషన్ పెంచడం ట్రెండ్ అయిపోయిందిఈ రోజుల్లో. స్టార్ హీరోలే కాదు కొందరు అగ్ర దర్శకులు కూడా భారీగానే పుచ్చుకుంటున్నారు. ఓ సినిమా బడ్జెట్ రూ.500 కోట్లు అయితే అందులో హీరో రెమ్యూనరేషన్ కే రూ.100 కోట్లు పోతుంది. ఆ రేంజ్ లో స్టార్ హీరోలు పారితోషకాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇదే విషయంపై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


'కోటబొమ్మాలి పిఎస్' మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కి హాజరైన అల్లు అరవింద్ స్టార్ హీరోల రెమ్యునరేషన్స్, సినిమా బడ్జెట్ లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 'కోటబొమ్మాలి పిఎస్' మూవీ టీజర్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఓ విలేఖరి..' కొంతకాలంగా గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమాలు రావడం లేదు ఎందుకు? సినిమాల బడ్జెట్ పెరగడమే అందుకు కారణమా? ఆ లెక్కన చూసుకుంటే మీ ఫ్యామిలీ నుంచి ఉన్న హీరోలు కూడా భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు కదా? అని అల్లు అరవింద్ ని ప్రశ్నించగా, దానికి అల్లు అరవింద్ బదులిస్తూ..


" ప్రస్తుతం పెరిగిన సినిమా నిర్మాణ వ్యయంలో హీరోలు తీసుకున్నది 20 నుంచి 25 శాతం మాత్రమే. కాబట్టి హీరోల వల్ల సినిమాల కాస్ట్ పెరిగిపోతుంది అనడం కంటే నిర్మాణ వ్యయం పెరిగిన సినిమాల్లో హీరోలు ఉంటున్నారు అని అనడం కరెక్ట్. పేర్లు చెప్పడం బాగోదు. కొన్ని సినిమా నిర్మాణ వ్యయాల్లో హీరోల రెమ్యూనరేషన్లు ఎంతున్నాయో మీరే లెక్క వేసుకోండి. చాలా మేరకు తక్కువగానే ఉన్నాయి. ఆడియన్స్ కూడా పెద్దగా చూపిస్తేనే పెద్ద సినిమాలను ఆదరిస్తారు. ఉదాహరణకి.. 'కేజిఎఫ్' ముందు యశ్ ఎంత పెద్ద హీరో? సినిమాను పెద్దగా చూపించారు కాబట్టే ఆ సినిమా ఆ రేంజ్ లో ఆడింది. మా గీత ఆర్ట్స్ నుంచి కూడా రెండు పెద్ద సినిమాలు రావాల్సి ఉండగా రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతున్నాయి" అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


కాగా గత కొన్ని కాలంగా మన టాలీవుడ్ లో సినిమాల బడ్జెట్స్ ఎంతగా పెరిగిపోతున్నాయో తెలిసిందే. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్ వచ్చినప్పటి నుంచి బడ్జెట్లు మరీ హద్దు దాటిపోవడంతో ఒక్కోసారి రిజల్ట్ తేడా కొట్టినప్పుడు నిర్మాతలు రిస్క్ లో పడుతున్నారు. అలా ఇప్పటికే పలువురు అగ్ర నిర్మాతలు భారీ నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే. ఇక 'కోటబొమ్మాలి పిఎస్' సినిమా విషయానికి వస్తే.. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తేజ మర్ని దర్శకత్వం వహిస్తున్నాడు. GA2 పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నవంబర్ 24న విడుదల చేయనున్నారు. బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రంజిన్ రా సంగీతం సమకూర్చారు.


Also Read : రష్మిక మార్ఫింగ్ వీడియో - భయమేస్తుందన్న చైతూ, మద్దతుగా మృణాల్, సాయి తేజ్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial