ఈమధ్య కొంతమంది బాలీవుడ్ మేకర్స్ రామాయణం పై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ మన పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో రామాయణం ఇతిహాసం ఆధారంగా 'ఆదిపురుష్' అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ముఖ్యంగా రామాయణాన్ని దర్శకుడు ఓం రౌత్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారనే వాదనలు ఎక్కువ వినిపించాయి. రామాయణం లాంటి మహాకావ్యాన్ని సినిమాగా తెరికెక్కించాలంటే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడు కావాలి.
అయితే అలాంటి అనుభవజ్ఞుడైన మరో బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి ఇప్పుడు రామాయణాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే రామాయణం ఆధారంగా తరికెక్కిన 'ఆదిపురుష్' ఘోరపరాజయాన్ని చవిచూడడంతో ఈ సినిమా రిజల్ట్ చూసి దర్శకుడు నితీష్ తివారి తాను తీస్తున్న రామాయణం విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదిపురుష్ మేకర్స్ చేసిన తప్పులు తాను చేయకూడదని రామాయణాన్ని సరిగ్గా ప్రేక్షకుల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొద్దిరోజులుగా నితీష్ తివారి రామాయణ ప్రాజెక్టు గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణంలో సీత పాత్రలో నటించాల్సిన ఆలియా భట్ తాజాగా తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆమె స్థానంలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోయిన్ ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామాయణంలో రాముడి గారు రణబీర్ కపూర్, సీతగా ఆలియా భట్ నటిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా కొన్ని బాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం సౌత్ బ్యూటీ సాయి పల్లవి ఇందులో సీత పాత్ర పోషిస్తుందట. శ్రీరాముడిగా రణబీర్ కపూర్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. నితీష్ తివారి ఆలియా భట్ స్థానంలో సాయి పల్లవిని ఎంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో రణబీర్ కపూర్ తో పాటు హృతిక్ రోషన్, దీపికా పదుకొనే ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా 'కేజిఎఫ్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో కన్నడ హీరో యశ్ ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటించబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే యశ్ మాత్రం ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేశాడనే టాక్ కూడా వినిపించింది. ఈ సినిమాలో రావణుని పాత్రలో యశ్ నటిస్తాడా? లేదా? అనేదానిపై మేకర్స్ ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. కాగా నితీష్ తివారి తెరకెక్కిస్తున్న 'రామాయణం' పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. 2024 చివర్లో లేదా 2025 ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పై ప్రేక్షకుల్లో అనేక సందేహాలు నెలకొనగా. మేకర్స్ త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి నటీనటుల వివరాలు మరియు విడుదల తేదీని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తోన్న 'సామజవరగమన' - స్ట్రీమింగ్ ఎక్కడ?, ఎప్పుడంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial