భారతీయుల విశ్వాసాలపై సినిమాలు తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పురాణాలు, ఇతిహాసాల్లో పొందుపరిచిన అంశాల్లో చిన్న మార్పు చేసినా.. మనోభావాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా దేవుళ్లపై సినిమాలు తీసేప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుందనేది ‘ఆదిపురుష్’ మూవీ రిజల్ట్ చెబుతుంది. ‘రామాయణం’లో మార్పులు చేయడమే కాకుండా, దేవుళ్లతో ఊరమాస్ డైలాగులు చెప్పించడంపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. ఫలితంగా రూ.500 కోట్లతో తెరకెక్కించిన ఈ గ్రాఫిక్ వండర్.. డిజస్టర్‌గా మిగిలిపోయింది. ‘ఆదిపురుష్’ మూవీ మేకర్స్‌పై అలహాబాద్ హైకోర్ట్ సైతం అసహనం వ్యక్తం చేసింది. సెన్సార్ బోర్డు తీరుపై మండిపడింది. 


‘ఓఎంజీ 2’పై ‘ఆదిపురుష్’ ప్రభావం?


అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తోన్న ‘ఓఎంజీ 2’ మూవీపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘ఆదిపురుష్’ మూవీపై చేసిన పొరపాటు ‘ఓఎంజీ 2’లో రిపీట్ కాకుండా జాగ్రత్తలు పడుతోంది. ఈ నేపథ్యంలో సెన్సార్ కంటే ముందు.. ఈ మూవీలో ప్రజల మనోభావాలు దెబ్బతీసే డైలాగులు, సీన్లు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించాలంటూ CBFC (సెన్సార్ బోర్డ్).. రివ్యూ కమిటీని కోరినట్లు తెలిసింది. కమిటీ నిర్ణయం తర్వాత ఈ మూవీకి సర్టిపికెట్ జారీ చేయడం లేదా మార్పులు సూచించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చివరి దశలో అన్నీ పరిశీలించిన తర్వాతే మూవీ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. అప్పటివరకు ఆ మూవీ విడుదలను ఆపాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. 


అలాంటిది ఏమీ లేదు: మూవీ మేకర్స్


మూవీ ప్రొడక్షన్ టీమ్ ఈ సమాచారాన్ని కొట్టిపడేశారు. OMG 2 సెన్సార్ రిపోర్ట్ జారీ చేసే విషయంలో CBFC ఇప్పటివరకు తమతో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ఈ మూవీ కమిటీ పరిశీలనలో ఉండటం వల్లే సెన్సార్ రిపోర్ట్‌ను జారీ చేయడం ఆలస్యమవుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమిత్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో పంకజ్ త్రిపాఠి, యమీ గౌతమ్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ‘ఓఎంజీ 2’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతానికైతే ప్రేక్షకుల నుంచి గానీ, హిందూ సంఘాల నుంచి గానీ.. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. మూవీ రిలీజ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. 


సెన్సార్ తీరుపై మండిపడిన హైకోర్ట్..


‘ఆదిపురుష్’ సినిమాలో ఉన్న డైలాగ్ లు అసలైన రామయాణంలో పాత్రలను అవమానపరిచేవిధంగా ఉన్నాయని, ఈ సినిమాను నిషేధించాలని హైకోర్ట్ లు పిటిషన్ లు వేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈకేసు విచారించిన అలహాబాద్ హైకోర్టు.. దర్శకనిర్మాతలు, సెన్సాన్ బోర్డ్ పై మండిపడింది. సినిమాలోని సంభాషణల విషయంలో సెన్సార్ బోర్డ్ తీరును తప్పుబట్టింది. ఈ సంభాషణలు ఎలా సమర్థించారని,  ఇలాంటి వాటితో భవిష్యత్ తరాలకు ఏం చెబుదామనుకుంటున్నారు అని ప్రశ్నించింది. విచారణకు దర్శకనిర్మాతలు హాజరు కాకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే మూవీలోని అభ్యంతరకరమైన సంభాషణలు తొలగించామని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్ట్ స్పందస్తూ.. డైలాగ్స్ ఒక్కటే కాదని, సన్నివేశాలు కూడా ఏం చేస్తారనేదానిపై సూచనలు తీసుకోవాలని చెప్పింది.


Also Read  విస్కీ పూరితో వెరైటీ మాస్ ఇంట్రో - శివన్న కూడా ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే!








ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial