Ajay Devgn About Paranormal Activity On Outdoor Shoots: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'సైతాన్'. హారర్‌ థ్రిల్లర్‌ గా రూపొందిన చిత్రానికి వికాస్‌ భల్‌ దర్శకత్వం వహించారు. మార్చి 8న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. పూర్తి స్థాయి బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటి థ్రిల్లింగ్‌ అంశాలతో ఈ ట్రైలర్ రూపొందింది. సరదాగా సాగిపోతున్న ఓ కుటుంబంలోకి ఓ అనుకోని వ్యక్తి ప్రవేశించిన ఎలాంటి భయంకర ఘటనలకు కారణం అవుతాడు? అతడి నుంచి హీరో ఫ్యామిలీ ఎలా బయట పడుతుంది? అనే అంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. మాధవన్‌ వశీకరణ శక్తులు కలిగిన విలన్ పాత్రలో అద్భుతంగా నటించాడు.


బ్లాక్ మ్యాజిక్ గురించి అజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు


ఇక ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో మాట్లాడిని అజయ్ దేవగన్ బ్లాక్ మ్యాజిక్ గురించి, వశీకరణ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “నేను చాలా కాలం నుంచి హారర్ జానర్‌ లో సినిమా చేయాలనుకుంటున్నాను. నేను ఇంతకు ముందు ‘భూత్’ చేశాను. అలాంటి సినిమానే ‘సైతాన్’ కూడా. నిజానికి బ్లాక్ మ్యాజిక్ ప్రతి సంస్కృతిలో ఉంటుంది. ఈ సినిమాలోనే కాదు. చాలా మంది కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని నమ్ముతారు. నేనూ నా కెరీర్ లో పలు షూటింగ్స్ సమయంలో పారానార్మల్ యాక్టివిటీస్ ని గమనించాను. నేనూ చాలా అతీంద్రియ అనుభవాలను ఎదుర్కొన్నాను. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ నిజమా? కాదా? అనే విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి. నాకు మాత్రం అలాంటి అనుభవాలు చాలా ఎదురయ్యాయి. ఇంట్లో మనుషులకు ఆరోగ్యం బాగా లేకపోయినా, ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నా చాలా మంది ఇలాంటి సమస్య ఉండవచ్చు అని భావిస్తారు.


ఆ అమ్మాయిని చూసి కన్నీళ్లు వచ్చాయి- జ్యోతిక


ఇక ఈ సినిమా గురించి జ్యోతిక కీలక విషయాలు వెల్లడించింది. “కూతురు గురించి తండ్రి కంటే ఎక్కువ తల్లి పట్టించుకుంటుంది. ఆమె సమస్యల్లో ఉంటే యోధురాలిగా పోరాడుతుంది. ఈ సినిమాలో కూతురు నా నిజ జీవితంలోని కూతురుగా కనిపించింది. నా కూతురు వయసుకు కూడా దాదాపు సమానం. ఈ సినిమాలో అమ్మాయి పరిస్థితి చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి. సినిమా అని తెలిసినా అలా ఫీలయ్యాను. తల్లి మనసు అలాగే ఉంటుంది” అని చెప్పుకొచ్చింది.


మార్చి 8న ‘సైతాన్‘ విడుదల


ఇక ‘సైతాన్’ సినిమా మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  అజయ్ పనోరమా స్టూడియోస్, జియో స్టూడియోస్‌ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అజయ్ దేవగన్‌‌, జ్యోతి దేశ్‌‌పాండే, అభిషేక్ పాఠక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం గుజరాతికి చెందిన 'వష్' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. అజయ్ ఈ సినిమాతో పాటు ‘సింగం 3’ కూడా చేస్తున్నారు. 


Read Also: సోనుసూద్ హోటల్ బిల్లు పే చేసిన అజ్ఞాత అభిమాని, లెటర్‌లో ఏం రాశాడంటే?