లయాళ అగ్ర నటుడు మోహన్లాల్ నటించిన 'దృశ్యం' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఇతర భాషల్లోనూ రీమేక్ చేశారు. అన్ని భాషల్లో ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. హిందీ రీమేక్ లో అజయ్ దేవగన్ , తమిళంలో కమలహాసన్, తెలుగులో విక్టరీ వెంకటేష్ తో ఈ సినిమాని రీమేక్ చేశారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ గా 'దృశ్యం 2' 2021లో నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. మలయాళం లో పాటు తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను కనబరిచింది. అయితే హిందీ వెర్షన్ ని మాత్రం ఏకంగా థియేటర్స్ లోనే రిలీజ్ చేశారు.


అజయ్ దేవగన్ లీడ్ రోల్ లో నటించిన 'దృశ్యం 2' థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు 2022లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక ఆడియన్స్ అంతా దృశ్యం పార్ట్ 3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో దృశ్యం 3 సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. మొదటి రెండు భాగాలను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఇప్పుడు 'దృశ్యం 3' కోసం షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. అదేంటంటే 'దృశ్యం 3' ని మేకర్స్ మలయాళం సహా హిందీ భాషలో ఒకేసారి తెరకెక్కించాలని అనుకుంటున్నారట. అంతేకాకుండా (హిందీ, మలయాళం) రెండు ఒకేసారి చిత్రీకరించి రెండు భాషల్లోనూ ఒకే తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలా చేయడంవల్ల సినిమాలో స్పాయిలర్స్ కి అస్సలు అవకాశం ఉండదని మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చారట. ఇక మలయాళం లో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, హిందీలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు.


ప్రస్తుతం దర్శకుడు జీతూ జోసెఫ్ స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇక పార్ట్ 3 తో దృశ్యం ఫ్రాంచైజీకి ఎండ్ కార్డ్ పడనట్లు సమాచారం. ఇక 2024లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే  అవకాశం ఉంది. అజయ్ దేవగన్ ప్రస్తుతం తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. అజయ్ దేవగన్ తన నెక్స్ట్ మూవీని వికాస్ బహల్ డైరెక్షన్లో చేయబోతున్నాడు. దాని అనంతరం 'సింగం 4' సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తయ్యాక 'దృశ్యం 3' షూటింగ్లో జాయిన్ కానున్నాడు. కాగా అజయ్ దేవగన్ రీసెంట్ గా 'భోళా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో కార్తీ హీరోగా నటించిన 'ఖైదీ' అనే సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కింది. అజయ్ దేవగన్ సరసన అమలాపాల్ హీరోయిన్గా నటించగా.. టబు, లక్ష్మీ రాయ్, అభిషేక్ బచ్చన్ లాంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మార్చి 30న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. అజయ్ దేవగన్ దర్శకత్వం వహించడంతోపాటు స్వయంగా నిర్మించడం విశేషం.


Also Read: అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ‘AAA సినిమాస్’లోని ఈ ప్రత్యేకతలు మీకు తెలుసా?