Lal Salaam Release Date: సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో, ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో 'లాల్ సలామ్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది. అయితే ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అనే దానిపై అనేక వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.


'లాల్ సలామ్' చిత్రాన్ని 2024 ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుపుతూ కొత్త పోస్టర్ ను ఆవిష్కరించారు. నిజానికి ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. కొన్ని వారాల క్రితమే డబ్బింగ్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని చిత్ర దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు కూడా. అయితే లైకా బ్యానర్ భాగస్వామ్యంలో రూపొందుతున్న మరో రెండు సినిమాలు పొంగల్ రేసులో ఉండటంతో, తలైవర్ చిత్రాన్ని ఫిబ్రవరిలో తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.






లైకా నిర్మాణంలో అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 'మిషన్ చాప్టర్ 1' సినిమాని జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. మరో వైపు అదే రోజున విడుదల కాబోతున్న ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' చిత్రాన్ని ఓవర్ సీస్ లో సుభాస్కరన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ పండక్కి లైకా ప్రొడక్షన్ నుంచి రెండు సినిమాలు వస్తుండటంతో, క్లాష్ ని నివారించడానికి 'లాల్ సలాం' చిత్రాన్ని ఫిబ్రవరి 9న అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజినీకాంత్ నటిస్తోన్న సినిమా కావటంతో ‘లాల్ సలామ్’ పై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రికెట్ ప్రధానాంశంగా ముంబై బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో ఆయన మెయినుద్దీన్ భాయ్ అనే పవర్‌ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. కాకపోతే ఇది ఫుల్ లెంత్ రోల్ కాదు. స్పెషల్ క్యామియో అయినప్పటికీ కథలో చాలా కీలకంగా ఉండే క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్, జీవితా రాజశేఖర్ త‌దిత‌రులు కనిపించనున్నారు.


'లాల్ సలామ్' చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. విష్ణు రంగస్వామీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. రెడ్ గైయింట్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉంది. గతంలో రజినీ కాంత్ వాయిస్ ఓవర్ తో 'సినిమా వీరన్' అనే డాక్యుమెంటరీని రూపొందించిన ఐశ్వర్య.. ఇప్పుడు తొలిసారిగా తన తండ్రిని డైరెక్ట్ చేస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి తలైవర్ స్పెషల్ అట్రాక్షన్ గా రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.


Also Read: డెబ్యూతోనే సత్తా చాటిన నవతరం దర్శకులు - టాలీవుడ్ ఫ్యూచర్ స్టార్ డైరెక్టర్స్ వీరేనా?