సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ చిన్న ఘటన జరిగినా.. ఇదిగో పులి అంటే.. అదిగో తోక అనేలా రకరకాల వార్తలు పుట్టుకొచ్చేస్తున్నాయి. తాజాగా నటుడు నరేష్ వీకే, పవిత్ర లోకేష్ విషయంలో అదే జరుగుతోంది. నరేష్ గురువారం పవిత్ర లోకేష్‌ను పెళ్లాడినట్లు ఓ వీడియో వదిలారు. అది ఎంతవరకు నిజమో తేలేలోపే.. కొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. వారిద్దరికీ రెండు నెలల కిందటే పెళ్లయ్యిందని, హనీమూన్‌కు కూడా వెళ్లి వచ్చేశారని.. పాత వీడియోనే నరేష్ షేర్ చేశారనేది ఆ వార్తల సారాంశం. కొన్ని వార్తా సంస్థలైతే.. పెళ్లి చేసుకున్న వెంటనే నరేష్, పవిత్ర హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లిపోయినట్లు పేర్కొన్నాయి. షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ జంట ప్రస్తుతం దుబాయ్‌లో లేరు. హైదరాబాద్‌లోనే ఉన్నారు. తన పెళ్లి వీడియో వదిలిన కొన్ని గంటల తర్వాత నరేష్.. హైదరాబాదులో ‘ఇంటింటి రామాయణం’ మూవీ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. దీన్ని బట్టి చూస్తే.. పవిత్రా లోకేష్, నరేష్‌ల హనీమూన్ వార్త ఫేక్ అని తెలుస్తోంది. కేవలం హనీమూన్ మాత్రమే కాదు.. వారి పెళ్లి కూడా ఫేక్ అని తెలుస్తోంది. అయితే, నరేష్ స్వయంగా ట్వీట్ చేసి ఈ విషయం చెప్పారు కాబట్టి.. నమ్మక తప్పదు. ఆయన తన పెళ్లి తూచ్.. అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 


పెళ్లి వీడియోతో షాకిచ్చిన నరేష్ 


ప్రముఖ నటుడు నరేష్ వీకే, పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, చాలామంది ఇది ఫేక్ కావచ్చనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం నరేష్, ఆయన మూడో భార్య మధ్య విడాకుల కేసు నడుస్తోంది. అయితే, అది కొలిక్కి వచ్చిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. ఒక వేళ వారి కేసు కోర్టులో ఉన్నట్లయితే నరేష్, పవిత్రా లోకేష్‌ల పెళ్లి చెల్లకపోవచ్చు. ఈ నేపథ్యంలో నరేష్ కావాలనే ఈ వీడియో వదిలారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


పెళ్లి నిజమేనా? 


నరేష్ పోస్ట్ చేసిన వీడియోను బాగా గమనిస్తే.. అది నిజమైనా పెళ్లిలా లేదు. పైగా ఆ వీడియోలో ఉన్నవారు కూడా బంధువుల్లా లేరు. ఏదో ఒక స్టూడియో సెట్టింగ్‌లో పెళ్లి చేసినట్లుగా విజువల్స్ కనిపిస్తున్నాయి. దీంతో ఇది ఏదైనా ప్రకటన కోసం కూడా కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే నరేష్ చేసిన ట్వీట్ కూడా అంత స్పష్టంగా లేదు. తాజాగా ఆయన నటించిన ‘ఇంటింటి రామాయణం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగానే తన పెళ్లి వీడియో వదిలి ఉంటారనే సందేహాలు కూడా ఉన్నాయి. ఒక వేళ ఆయన మూడో భార్య రమ్య కోర్టులో ఈ పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తే.. నరేష్ ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అది సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేసిన పబ్లిసిటీ స్టంట్ అని చెప్పినా ఆశ్చర్యపోవక్కర్లేదు. 


కోర్టు నమ్ముతుందా?


నరేష్, పవిత్ర.. ఇద్దరూ నటీనటులే. కాబట్టి, వృత్తిలో భాగంగా ఇలాంటి సీన్లలో నటించడం సర్వ సాధారణమే. పైగా వీరు టాలీవుడ్‌లో పాపులర్ లవ్ బర్డ్స్. ఈ నేపథ్యంలో ప్రకటన సంస్థలు కూడా వీరి జోడి తమ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఒక వేళ రమ్య కోర్టులో ఈ వీడియోను చూపించి ఆరోపణలు చేయాలన్నా కష్టమే. కేవలం నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నట్లు ధృవీకరించే మ్యారెజ్ సర్టిఫికెట్ చూపించగలిగితేనే కోర్టు కూడా నమ్ముతుంది. అందుకే, నరేష్ ఇలా గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి సీన్ క్రియేట్ చేసి.. శాంపిల్‌గా ఈ వీడియో వదిలి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  


Also Read : గుండెల్లో దేశాన్ని నింపుకొని, భారతీయుడిగా ఆస్కార్స్ రెడ్ కార్పెట్ మీద నడుస్తా - ఎన్టీఆర్