Vincy Aloshious Withdraws Complaint Against Shine Tom Chacko: ఓ మూవీ సెట్‌లో నటుడు డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఇటీవలే సంచలన ఆరోపణలు చేశారు ప్రముఖ మలయాళ నటి విన్సీ అలోషియస్ (Vincy Aloshious). తాజాగా.. కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో పాటు 'అమ్మ' అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, నటుడి పేరు ఎక్కడా బయట పెట్టకపోయినా ఫిర్యాదు తర్వాత నటుడు 'షైన్ టామ్ చాకో'పైనే (Shine Tom Chacko) ఆమె ఫిర్యాదు చేశారనే విషయం బయటకు వచ్చింది.
పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది
త్వరలో విడుదల కానున్న 'సూత్రవాక్యం' సినిమా సెట్‌లో షూటింగ్ సమయంలో నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి విన్సీ అలోషియస్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను ఫిర్యాదు చేసేటప్పుడే అతని పేరు ఎక్కడా బయటకు రాకూడదని అధికారులకు చెప్పానని.. వారు బహిర్గతం చేసినట్లు తెలిపారు. తన కంప్లైంట్ వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు.
Also Read: నెలలోపే ఓటీటీలోకి విక్రమ్ కొత్త మూవీ 'వీర ధీర శూరన్' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
'పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది'
'నేను కంప్లైంట్ చేసినప్పుడే ఆ నటుడి పేరు, ఇతర వివరాలు ఎక్కడా బయటకు రాకుండా చూడాలని సంబంధిత అధికారులకు చాలా స్పష్టంగా చెప్పాను. కానీ వాళ్లు ఇప్పుడు నాకు నమ్మక ద్రోహం చేశారు. ఓ నటుడు చేసిన తప్పు వల్ల మొత్తం చిత్ర బృందంపై ఎఫెక్ట్ పడుతుంది. ఇలా జరగడం కరెక్ట్ కాదు. అలా అనే నేను ఆ నటుడి పేరును ఎక్కడా ఇంటర్వ్యూల్లో చెప్పలేదు. నాకు ఎదురైన చేదు అనుభవాల గురించి తెలుసుకున్న సినీ రంగానికి చెందిన పలు సంస్థల నుంచి ఎంతో మద్దతు లభించింది. ఆ నటుడు ఎంతో ప్రతిభావంతుడు. అతనికి సినిమాల్లో అవకాశాలు ఇవ్వడంలో తప్పు లేదు. నేను కోరుకునేది ఒక్కటే. చేసిన తప్పులను సరిదిద్దుకునే ఛాన్స్ అతనికి ఇద్దాం. ఈ సంఘటనతో నాకు అధికారులపై నమ్మకం కోల్పోయాను. నేను కంప్లైంట్ వెనక్కు తీసుకుంటున్నా.' అని పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే?
నటి విన్సీ అలోషియస్.. ఇటీవల ఓ సినిమా సెట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ వీడియో ద్వారా వివరించారు. మూవీ సెట్‌లో డ్రగ్స్ తీసుకుని నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన ఆరోపణలు చేశారు. షూటింగ్ జరిగినన్ని రోజులు తనతో అనుచితంగా ప్రవర్తించాడని.. తన ముందే దుస్తులు మార్చుకోవాలని ఇబ్బంది పెట్టాడని తెలిపారు. 'దీని తర్వాత డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో ఇకపై పని చేయకూడదని నిర్ణయించుకున్నా. దీని వల్ల భవిష్యత్తులో నాకు ఎక్కువ అవకాశాలు రాకపోవచ్చు. కానీ ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నా.' అని పేర్కొన్నారు. దీనిపై కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో పాటు 'అమ్మ' అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుండగా.. తాజాగా నటుడి పేరు బహిర్గతం చేశారంటూ ఆమె ఫిర్యాదు వెనక్కు తీసుకున్నట్లు తెలిపారు.
సినిమాల విషయానికొస్తే.. విన్సీ అలోషియస్ 2019లో 'వికృతి' అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. 'రేఖ' మూవీలో ఆమె నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. అలాగే 'జన గణ మన', 'సౌదీ వెల్లక్క', 'పద్మిని', 'పజంజన్ ప్రణయం' వంటి మలయాళ హిట్ సినిమాల్లో నటించారు. చివరిగా 'మారివిల్లిన్ గోపురంగల్' చిత్రంలో మీనాక్షిగా తెరపై మెరిశారు.
షైన్ టామ్ చాకో.. 'దసరా' సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ఆ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత రంగబలి, దేవర, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు.