Samantha New Meaning About Success: సక్సెస్ అంటే కేవలం విజయాలు సాధించడం మాత్రమే కాదని ప్రముఖ నటి సమంత (Samantha) అన్నారు. గత కొద్ది రోజులుగా సిడ్నీలో పర్యటిస్తోన్న ఆమె ఇటీవల అక్కడ జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సిడ్నీలో పాల్గొన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కెరీర్‌లో రాణించినట్లు చెప్పారు. సామాజిక పట్టింపులు, కట్టుబాట్ల నుంచి విముక్తి పొందడం, స్వేచ్ఛగా జీవించడం వంటివి కూడా సక్సెస్‌ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

'ఇతరులు చెప్పేవరకూ వేచి ఉండను'

తన దృష్టిలో సక్సెస్ అంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అని సమంత చెప్పారు. 'నేను సక్సెస్ అయ్యానని ఇతరులు చెప్పే వరకూ వేచి ఉండను. సక్సెస్ అంటే మనకు నచ్చిన విధంగా జీవించడం. అలాగే, మన అభిరుచికి తగ్గట్లుగా పనులు చేయడం. అంతేకానీ, మహిళలను ఒక చోట బంధించి ఇది చేయాలి.. అది చేయకూడదు.. అని చెప్పడం కాదు. నిజ జీవితంలో ఎన్నో రకాల పాత్రలను పోషిస్తూ అన్నింటిలో సమర్థంగా రాణించగలగడమే సక్సెస్.'  అంటూ సమంత కొత్త అర్థం చెప్పారు.

Also Read: కేతిక శర్మ 'అదిదా సర్ ప్రైజు' హుక్ స్టెప్‌పై విమర్శలు - మూవీ టీం ఏం చేసిందో తెలుసా?

అందుకే నిర్మాణ రంగంలోకి..

నూతన టాలెంట్, అద్భుతమైన కథలను ప్రేక్షకులకు అందించేందుకు తాను నిర్మాణ రంగంలో అడుగుపెట్టినట్లు సమంత తెలిపారు. సిడ్నీ పర్యటనలో భాగంగా ఆమె అక్కడి యువతతో మాట్లాడారు. తాను చదువుకునే రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్లాలని.. సిడ్నీ యూనివర్శిటీలో చదువుకోవాలని తాను అనుకున్నానని.. అయితే అది నెరవేరలేదని చెప్పారు. అనుకోకుండా తాను సినీ రంగంలో అడుగుపెట్టానని.. నటిగా ఇంతమంది అభిమానం పొందడంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలని సూచించారు.

నెటిజన్ ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్

ఈ సందర్భంగా సిడ్నీ వైల్డ్ లైఫ్ పార్కులో సరదాగా గడిపిన సామ్.. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆ ఫోటోలు తీసింది ఎవరని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. "@sydneytourguide Naomi" అని బదులిచ్చారు. అంటే ఆ వెకేషన్ పిక్స్ తీసింది అక్కడి లోకల్ టూరిస్ట్ గైడ్ అన్నమాట.

ఇక మూవీస్ విషయానికొస్తే.. సమంత చివరిసారిగా వరుణ్ ధావన్ హీరోగా నటించిన 'సిటాడెల్: హన్నీ బన్నీ' వెబ్ సిరీస్‌లో కనిపించారు. ప్రస్తుతం ఆమె 'రక్త్ బ్రహ్మాండ్' యాక్షన్ సిరీస్ కోసం వర్క్ చేస్తున్నారు. ఇక రాజ్ & డీకే తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటింగ్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3'లో ఆమె కనిపించనున్నారు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, జైదీప్ అహ్లవత్ తదితరులు ఈ సిరీస్‌లో కీలక పాత్రల్లో కనిపించారు. 'మా ఇంటి బంగారం' అనే సినిమాలోనూ నటిస్తున్నట్లు సమంత ఇటీవల ప్రకటించారు. ఆమె నిర్మాతగా వ్యవహరిస్తోన్న 'శుభం' మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రానికి 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు.